ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన చెన్నై కోయంబేడు మార్కెట్ తమిళనాడులో కరోనా కేసులను విపరీతంగా పెంచేసింది. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా కాయగూరలు కొనుగోలు చేసేందుకు వెళ్లినవారంతా కొసరుగా వైరస్‌ను తమవెంట తీసుకెళ్లారు. గురువారం నాటికి తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య 9,227కు చేరింది. ఇందులో 4,089మంది విదేశాల నుంచి కరోనాను దిగుమతి చేసుకొచ్చారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు 1,365మంది కాగా, కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి 2700మంది కరోనా బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోయంబేడు మార్కెట్ వ్యాపారులపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోయంబేడు మార్కెట్‌లోని ఓ సెలూను షాపు యజమానికి, పండ్ల వ్యాపారికి తొలుత కరోనా సోకినట్లు తేలింది. అప్పుడే మార్కెట్ మూసివేయాలని కరోనా నిరోధక విభాగం ప్రత్యేక అధికారి(నోడల్ ఆఫీసర్) జే.రాధాకృష్ణన్ కోరినా వ్యాపారులు పట్టించుకోలేదు.
పండ్ల వ్యాపారులను బుజ్జగించి మాధవరం కొత్త బస్‌స్టేషన్ వద్దకు పండ్లు, పూల మార్కెట్లను తరలించారు. చివరకు కోయంబేడు మార్కెట్‌లో కాయగూరలు కొని విల్లుపురం, కడలూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లినవారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ మార్కెట్‌ను మూసివేశారు. ఈ నేపథ్యంలో కోయంబేడు మార్కెట్‌లో ఉన్న ధాన్యం వ్యాపారులు తమ వ్యాపారాలను అనుమతించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.దురైసామి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోయంబేడు మార్కెట్ సీఈవోకు నోటీసు జారీ చేశారు.

