జిల్లాలోని పెదకూరపాడు మండల పరిధిలోని కాశిపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన దోపిడీ, హత్య తీవ్ర కలకలం రేపింది. డబ్బుకోసమే ఎదురింటికి చెందిన వ్యక్తి ఈ దారుణానికి ఒడిట్టడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో అవసరాలకు చేతిలో డబ్బు లేకపోవడంతో ఇటువంటి నేరపూరిత ఆలోచనలు రేకెత్తడం విస్మయం కలిగిస్తోంది. నిందితుడు మల్లెల గోపికృష్ణ అలియాస్ పిల్ల గోపి ట్రాక్టర్ డ్రైవర్. లాక్‌డౌన్‌తో పనులు లేవు. ఇతడిది నేర స్వభావం. కొన్నేళ్ల క్రితం వివాహం జరిగినా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో డబ్బు అవసరం పెరిగింది. కుటుంబ అవసరాలకు తోడు మద్యం అలవాటు కూడా ఉంది. ఈ క్రమంలో డబ్బు అవసరం గోపీలోని నేరస్వభావాన్ని మరింగా తట్టిలేపింది.
ఈ పరిస్థితుల్లో ఎదురింటికి చెందిన వృద్ధ దంపతులపై పడింది. నాలుగురోజులు పథకం రూపొందించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఉదంతాన్ని తేలికగా తీసుకోకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నెలకున్న ఆర్థిక ఇబ్బందులు మనుషుల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు వంటి తీవ్ర నేరాలకు కూడా అవకాశం ఉంటుందంటున్నారు. దీనిని బట్టి ఒంటరి మహిళలు, వృద్ధులు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. లాక్‌డౌన్ పరిణామాలు నేరాలకు దారితీయడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి

