ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని పొలాల్లో మిర్చి కోతలకు వెళ్లిన కూలీలు ట్రాక్టర్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
► మాచవరం గ్రామానికి చెందిన నల్లూరి చెంచయ్య తాను కౌలుకు తీసుకున్న 3 ఎకరాల పొలంలో మిర్చి కోతలకు 23 మంది కూలీలను తన ట్రాక్టర్‌లో ఎక్కించుకుని మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. ఈ కూలీలంతా ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చారు.
► ఇంటికి తిరిగి వస్తుండగా అమ్మనబ్రోలు–నాగులుప్పలపాడు మధ్య హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉన్న స్తంభాన్ని ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

