నేను పవన్‌కు పెద్ద ఫ్యాన్.. ఆయనో 'ఆరడుగుల బుల్లెట్'!
రాజకీయాల్లోకి రాకపోతే పవన్‌తో 'సూపర్ హిట్' సినిమా తీసేవాడిని: ఎమ్మెల్యే ప్రత్తిపాటి
శారద స్కూల్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే
విద్యార్థులతో ముచ్చటించి, ల్యాబ్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం
చంద్రబాబుకు పవన్ కుడి భుజం.. గత పాలనలో విద్య నిర్వీర్యం
చిలకలూరిపేట :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్.. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా ఆయనతో ఓ సూపర్ హిట్ సినిమా తీసి ఉండేవాడిని అని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని శారద హైస్కూల్‌లో జరిగిన పేరెంట్స్ మీట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
విద్యార్థులతో డిప్యూటీ సీఎం ముచ్చట్లు.
ముందుగా పాఠశాలకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్‌ను సందర్శించి, అక్కడ విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించారు. పవన్ రాకతో పాఠశాల ఆవరణలో, చిలకలూరిపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
చంద్రబాబుకు కుడి భుజం..
సభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుడి భుజంలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరించి, విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. చిలకలూరిపేట గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి కృష్ణతేజ కుటుంబం గతంలోనే కోట్ల విలువైన ఆస్తులను మున్సిపాలిటీకి విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. ఈ నియోజకవర్గం ఇప్పటివరకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను దేశానికి అందించిందని గర్వంగా చెప్పారు.
సినిమా తీయాలనుకున్నా..
పవన్ కళ్యాణ్ 'సుస్వాగతం' సినిమా చూసిన వెంటనే తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని ప్రత్తిపాటి తెలిపారు. అప్పట్లోనే దర్శకుడు భీమినేని శ్రీనివాసరావును కలిసి పవన్‌తో సినిమా తీయాలని ఉందని తన మనసులో మాట చెప్పానన్నారు. అయితే అనుకోకుండా తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని, లేదంటే పవన్‌తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేవాడినని ఆయన చమత్కరించారు. చిలకలూరిపేట ప్రజల చిరకాల కోరిక పవన్ రాకతో నెరవేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు..

