సినిమా వినోదమే.. చూసి చెడిపోవద్దు
ఆస్తులు, ఇళ్లపై కాదు.. పిల్లల జ్ఞానంపై పెట్టుబడి పెట్టండి
... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నటుడిగా నేనే చెబుతున్నా.. శాస్త్రవేత్తలే మనకు ఆదర్శం కావాలి
గంజాయి అమ్మితే తాట తీస్తాం.. పేటలో డ్రగ్స్ కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయండి
శారద స్కూల్ అభివృద్ధికి 25 కంప్యూటర్లు, పుస్తకాలు అందజేస్తా..
ఎమ్మెల్యే,కలెక్టర్, కమిషనర్ చొరవ తీసుకుని స్కూల్‌కు గ్రౌండ్ కేటాయించాలి
చిలకలూరిపేట:సినిమాలు కేవలం వినోదం కోసమే. వాటిని చూసి యువత, విద్యార్థులు చెడిపోవద్దు. ఒక నటుడిగా ఈ మాట నేనే స్వయంగా చెబుతున్నా. మనం ఎప్పుడూ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతగా ఉంటూ వారిని ఆదర్శంగా తీసుకోవాలి" అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారద హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీట్ (తల్లిదండ్రుల సమావేశం)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర ప్రసంగం చేశారు.
జ్ఞానంపై పెట్టుబడి ఏది?
సమాజ పోకడపై పవన్ స్పందిస్తూ.. "ప్రస్తుతం చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇళ్లు, బంగారం కొంటున్నారు. కానీ పిల్లల జ్ఞానాన్ని పెంచే దిశగా మాత్రం ఆలోచించడం లేదు. ఆస్తుల కంటే విజ్ఞానమే గొప్ప సంపద. లక్షలాది మెదడుల కలయికే ఒక చదువు" అని హితవు పలికారు. మారుమూల పల్లెలో పుట్టిన అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్తగా, మిసైల్ మ్యాన్ గా ఎదిగారంటే అది చదువు గొప్పతనమేనని గుర్తు చేశారు. టీచర్స్ కేవలం పాఠాలే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, గురువుల దీవెనలు పిల్లలకు శ్రీరామరక్ష అని అన్నారు.
స్కూల్ అభివృద్ధికి వరాలు..
విద్యార్థులకు ప్రశంసలు
శారద స్కూల్ ఒకప్పుడు 1600 మంది విద్యార్థులతో కళకళలాడేదని, ఇప్పుడది 800కు తగ్గిపోవడం, స్కూలుకు సరైన ఆటస్థలం (ప్లే గ్రౌండ్) లేకపోవడం బాధాకరమన్నారు. స్కూల్ లైబ్రరీని అభివృద్ధి చేసేందుకు తన వంతుగా బీరువాలు, మంచి పుస్తకాలు పంపిస్తానని, అలాగే 25 కంప్యూటర్లను బహూకరిస్తానని మాటిచ్చారు. స్కూల్ గ్రౌండ్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, కమిషనర్ రంజిత్ బాషాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వేదిక ముఖంగా కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రిహానా, బుచ్చేదా, నయోమి, శృతి, రత్నకుమార్ తమ ప్రతిభను చాటారని పవన్ కొనియాడారు. అలాగే విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న గౌసియాను ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయిపై ఉక్కుపాదం
చిలకలూరిపేటలో గంజాయి, మాదకద్రవ్యాల ప్రస్తావన తెస్తూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సప్లై విచ్చలవిడిగా జరిగింది. ఇకపై పేటలో గంజాయి అమ్మేవారు, వాడేవారు ఎవరైనా సరే వెంటనే అరెస్ట్ చేయండి. మత్తులో తూగేవారిని క్షమించవద్దు, కఠినంగా శిక్షించి తరిమికొట్టండి అని పోలీసులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

