చిలకలూరిపేటపట్టణంలోని జాతీయ రహదారిపై అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. అమాయక ప్రయాణికులపైకి దూసుకొచ్చిన మృత్యుశకటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొండమంజులూరు ఫంక్షన్ కు వెళ్లి వేలూరు వైపు వెళ్ళటానికి వస్తూ అడ్డరోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను, బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో సుమారు 6 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా, అందులోని ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి మాజీ కౌన్సిలర్ మౌలాలి చేరుకొని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను 108 లో ఎక్కించారు. తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.స్థానికుల సమాచారంతో పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, మొత్తం మూడు 108 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

