చిలకలూరిపేట: స్వాతంత్ర సమరయోధుల పేర్లను మార్చడం మంచి సంప్రదాయం కాదని, పేటలో ఇప్పటివరకు లేని కొత్త సంస్కృతిని దయచేసి ప్రవేశపెట్టవద్దని టిడిపి కౌన్సిలర్లు సమావేశంలో పాలకవర్గాన్ని కోరారు. స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి పేరిట 1948 లో పట్టణంలో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజల జీవనంలో ఒక భాగం గా మారిన చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరును ప్రస్తుత పాలకవర్గం మార్చవలసిన అవసరం ఏమిటో ప్రజలకు వివరించాలి. 1937 లోనే మద్రాసు ఫ్రాన్సిస్ లో శాసన సభ్యునిగా ఎన్నికై, రాజ్యాంగ సభకు ఎన్నికై, తదనంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన కల్లూరి చంద్రమౌళి వంటి వ్యక్తుల విశిష్టతను ప్రస్తుత తరాలకు అందించవలసిన ప్రభుత్వం, పాలకవర్గాలు, స్వాతంత్ర సమరయోధుల పేర్లను తీసివేస్తూ, వారిని అవమానించడాన్ని పట్టణ వాసులు ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. 7 మార్లు దేశం కోసం జైలు జీవితం గడిపిన స్వాతంత్ర సమర యోధుని పేరిట ఒక స్మారకంగా ఉన్న పేరును తీసి వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కూరగాయల మార్కెట్ ఏర్పడిన అనంతరం 3 పంచాయతీ పాలకవర్గాలు,7 పురపాలక వర్గాలు పట్టణానికి ప్రాతినిధ్యం వహించగా, ఏ ఒక్క పాలకవర్గం ఇటువంటి అసంబద్ధ నిర్ణయం తీసుకోవడం జరుగలేదన్నారు. వైఎస్ఆర్ పేరును నూతనంగా నిర్మించే ఎటువంటి నిర్మాణానికైనా పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కల్లూరి చంద్రమౌళి ఎవరో తమకు తెలియదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదని, సదరు నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. అలాగే గత సంవత్సరన్నర నుండి కరోనా కారణంగా ఆర్థికంగా ప్రజలు చితికిపోయి ఉంటే ఈ సమయంలో యూజర్ చార్జీలును అమలు పరచాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. చిరువ్యాపారులు, గృహ యజమానులు ఈ పన్నులు కట్టడానికి సిద్ధంగా లేరని తెలిపారు. చెత్త సేకరణ పురపాలక సంఘాల బాధ్యత అని, ప్రజలు ఇటువంటి వాటికి ఎందుకు పన్నులు కట్టాలి అని ప్రశ్నించారు. నీటి పన్ను, చెత్త సేకరణ పన్ను, మరుగు వ్యర్ధాల నిర్వహణ పన్నులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కరోనా వలన చనిపోయిన వారిని ఉచితంగా స్మశానానికి తరలించే మున్సిపల్ వాహనాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లును, కోవిడ్ సేవల అనుమతి పొందిన ఆసుపత్రిల వద్ద బోర్డులు పెట్టి ప్రజలకు తెలియజేయాలని, సదరు వాహనాలు ఉచితంగా అందించే విషయం పట్టణ ప్రజలకు ఇప్పటికీ తెలియదని తెలిపారు. మంచినీటి చెరువు వద్ద ఉన్న సుజల ప్లాంట్ ను (R.O PLANT) పునః ప్రారంభించి, మినరల్ వాటర్ ను కొనే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పురపాలక సంఘ మరియు సచివాలయ ఉద్యోగుల వినియోగానికి ఉపయోగించే మినరల్ వాటర్ నూ, 5 లక్షల రూపాయలతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద కొనవలసిన అవసరం లేదని, ఉన్న ప్లాంట్ ను వినియోగంలోకి తెస్తే సదరు నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ లు గంగా శ్రీనివాసరావు, పాములపాటి శివ కుమారి, కొత్త కుమారి, జంగా సుజాత, కంచర్ల కరుణ, కూనాల ప్రమీల, కనమర్లపూడి లక్ష్మీ తిరుమల, రాయని హరిత పాల్గొన్నారు.
June 1, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కూరగాయల మార్కెట్ పేరు మార్చే ప్రతిపాదన విరమించుకోవాలని: టిడిపి కౌన్సిలర్లు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

