చిలకలూరిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఆత్మబంధువు అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో బుధవారం జగనన్న తోడు లబ్ధిదారులకు చెక్కు అందజేశారు. కార్యక్రమానికి శాసనసభ్యురాలు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తీరుస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నీ సజావుగా అర్హులందరికీ అందుతున్నాయని తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లనే పాలనలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఇప్పుడు ఒక భరోసాతో ఉన్నారని తెలిపారు. తమకు ఆపద వస్తే ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారనే ధైర్యం ఇప్పుడు పేదలందరిలో ఉందని తెలిపారు. జగనన్న తోడు కార్యక్రమం ద్వారా చిరువ్యాపారులందరికీ ఆర్థిక భరోసా దక్కుతోందని చెప్పారు. వడ్డీలేని రుణాలను అత్యంత సునాయసంగా చిరువ్యాపారులకు చేరేలా గొప్ప అవకాశం జగనన్న తోడు ద్వారా తక్కుతోందని తెలిపారు. తోపుడు బండ్లు, గంపలపై వ్యాపారం చేసుకునే వారు సైతం ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. దీనివల్ల అధిక వడ్డీల జోలికి వెళ్లి పేదలు నష్టపోకుండా ఉంటారని వెల్లడించారు.
నియోజకవర్గంలో మొత్తం 2187 మందికి లబ్ధి
చిలకలూరిపేట నియోజకవర్గంలో జగనన్న తోడు పథకం ద్వారా రెండో విడతలో మొత్తం 2187 మంది లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట రూరల్ మండలంలో 530 మంది, యడ్లపాడు మండలంలో 465, నాదెండ్ల మండలంలో 472 మంది, చిలకలూరిపేట పట్టణంలో 720 మంది మొత్తం 2187 మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.2.187 కోట్ల రూపాయల రుణాలను ఇస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో తొలి విడతలో రూరల్ మండలంలో 323 మంది, యడ్లపాడు మండలంలో 346 మంది, నాదెండ్ల మండలంలో 652 మంది, చిలకలూరిపేట పట్టణంలో 1051 మంది మొత్తం 2372 మంది లబ్ధిదారులకు మొత్తం 2.372 కోట్ల రుణాలను అందజేశామన్నారు. రెండు విడతలు కలిపి మొత్తం రూ.4.559 కోట్ల రూపాయల రుణాలు ఇప్పటివరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి దక్కాయని వివరించారు. ఈ రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే అర్హుల ఖాతాలకు జమచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఈ అబ్దుల్ రహీమ్,ఎంపీడీఓ లు మాధురి,మోజేశ్,సి.యం.ఎమ్ మాలతి,మూడు మండలాల ఏ.పి.యం లు,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహా ఖాన్,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి,చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు,కౌన్సిలర్లు విడదల గోపి,బేరింగ్ మౌలాలి,జాలాది సుబ్బారావు,నాదెండ్ల జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్ రావు,నాగభైరు వెంకట్ మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.

