చిలకలూరిపేట: ఏ ప్రభుత్వ కార్యాలయమైనా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే అధికారులు, సిబ్బంది నడుచుకోవాలి. కాని చిలకలూరిపేటలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇందుకు పూర్తి విరుద్దం. ఇక్కడ నిబంధనలు అమలు కావు. వ్యక్తి నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఇక్కడి అధికారులకు, సిబ్బందికి పరిపాటిగా మారింది.
నిబంధనలు కాగితాలకే పరిమితం...
ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ సర్కారు సంకల్పించింది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలు వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండి పడుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి చెక్‌పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందువల్ల కార్యాలయంలో మధ్య వర్తుల ప్రమేయాన్ని నివారించవచ్చని ఆశించారు. కాని ఇవి ఇక్కడ కనిపించవు. రిజిస్ట్రేషన్లు మధ్యాహ్నం వరకే కొనసాగాలి. రిజిస్ట్రేషన్ టైమ్ అయిపోయినా కార్యాలయం తలుపులు మూసివేసి మరీ.. అర్దరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారు తమ రిజిస్ట్రేషన్‌లు సొంతంగా చేసుకునేలా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని సిబ్బందే ప్రోత్సహించడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరైనా ఈ విధానంలో తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని యత్నించినా వారికి సిబ్బంది సరైన సూచనలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కార్యాలయ ఆవరణలో రిజిస్ట్రేషన్లకు అయ్యే కమీషను, నిబంధనలు, అధికారుల పోన్ల నంబర్లు ప్రదర్శిస్తూ బోర్డు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు మధ్య దళారులు రాకుండా బోర్డు ఉంచాలి. కాని ఈ కార్యాలయంలో ఇవేమి కనబడవు.
తనాఖా ఆస్తులను సైతం రిజిస్ట్రేషన్లు...
ఎవరైనా తన అవసరాలకు భూమి, లేదా ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు. వారి ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు , బ్యాంకుల కు తనాఖా రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో తప్పని సరిగా ఈసీ చూసి, ఆ ఆస్తి ఎక్కడా తనఖా లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయాలి. కాని ఈ కార్యాలయ ప్రత్యేకత ఏమిటంటే తనాఖాలో ఉన్న ఆస్తులను సైతం ఎద్దేచ్చేగా రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ఇందుకు సంబంధించి ఉదాహరణ గా ఓ వ్యక్తి తన అవసరాల నిమిత్తం 6-10-2021న తనాఖా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే ఆస్తిని తనఖా నుంచి రిలీజ్ చేసుకోకుండా 3-01-2022న గిఫ్ట్ కింద తన కుటుంబ సభ్యులకు రిజిస్ట్రర్ అయ్యింది. దీంతోపాటు 2015 తనఖాలో ఉన్న ఆస్తిని జనవరి 2022లో తనఖా రిలిజ్ చేయకుండా ఆస్తిని వేరే వారికి అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు. ఇదే ఆస్తికి సంబంధించిన తనఖా నుంచి డిసంబర్ 2022 రిలీజ్ చేసుకోవటం విశేషం, ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
చర్యలు తీసుకుంటా... జిల్లా రిజిస్ట్రార్
పైన తెలిపిన విషయాలపై స్థానిక సబ్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరగా, తాను వివరణ ఇవ్వలేనని, ఉన్నతాధికారులను సంప్రంచాలని తెలిపారు. ఇదే విషయంలో జిల్లా రిజిస్ట్రార్‌ను ఫోన్ ద్వారా సంప్రదిస్తే తాను అన్ని విషయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

