చిలకలూరిపేట: శారీరక లోపాన్ని చూసి కుంగిపోలేదు అతను. కాళ్ళు లేకపోయినా సొంత కాళ్లపై నిలబడి... పూట గడవడమే కష్టంగా ఉన్న స్థితి నుంచి... ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుందాం...
చిలకలూరిపేట పట్టణం గుండయ్య తోటలో నివాసం ఉంటున్న వల్లెపు శ్రీనివాసులు (42)కు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ రెండు కాళ్లు లేకపోయినా ట్రై సైకిల్ ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు సమీపంలోని ఒక క్వారీలో పనిచేస్తున్న వల్లెపు శ్రీనివాసరావుకు 18 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. పెళ్లయి కొద్ది సంవత్సరాలే అయ్యింది. ప్రమాదం అనంతరం శ్రీనివాసరావు కు భార్య ఓ కూతురు ఉండటంతో కొద్ది రోజులు ఏం చేయాలో పాలుపోలేదు.
కాళ్లు లేకపోయినా... తన కాళ్లపై నిలబడాలనే తపన
ఎలాగైనా తన కుటుంబాన్ని పోషించాలని దృఢ నిశ్చయంతో ఒకదాత సహాయంతో ట్రై సైకిల్ తీసుకున్న అతను ఉదయం పూట పుచ్చకాయలు, సాయంత్రం పూట మొక్కజొన్న కండెలు, మరియు బొప్పాయి కాయలు ట్రై సైకిల్ పై పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ అమ్ముకుంటున్నాడు. అలా రోజుకు నాలుగు నుండి 500 వరకు సంపాదిస్తున్న తను ఎలానో నాలుగేళ్ల క్రితం తన కూతురికి వివాహం చేశాడు.
ప్రభుత్వం ద్వారా వస్తున్న పెన్షన్ తో తాను వుంటున్న ఇంటి అద్దెను కడుతున్నాడు. అయితే ఒయాసిస్, సి.ఆర్ క్లబ్ కు చెందిన దాతలు తనకు ట్రై సైకిల్ అందజేస్తున్నారని తనకు ప్రస్తుతం ట్రై సైకిల్ పాడైపోయిందని తెలిపాడు.
ప్రభుత్వ సహాయం ఏది..!?
కేంద్ర ప్రభుత్వం 1995 చట్టం ప్రకారం 7.2.1996 తేదీన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పునరావాసానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తుందని అయినా గాని తనకు పెన్షన్ తప్ప సౌకర్యాలు ఏమి లేవని వాపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ద్వారా ఉచితంగా ఇచ్చిన ఇళ్లలో తనలాంటి వికలాంగులకు రెండు శాతం రిజర్వేషన్ ఉన్నా కానీ తనకు ఎటువంటి ఇల్లు ప్రభుత్వం కేటాయించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు వల్లపు శ్రీనివాసరావు.
ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇప్పించండి
రెండు కాళ్లు కోల్పోయిన భిక్షాటన చేయకుండా ట్రై సైకిల్ ద్వారా వీధి, వీధి, తిరిగి ఆత్మవిశ్వాసంతో బతుకుతున్న వల్లపు శ్రీనివాసరావు లాంటి వారికి ప్రభుత్వం గానీ, ప్రజా ప్రతినిధులు గాని, స్వచ్ఛంద సేవా సంస్థలు గాని అతనికి నివసించడానికి ఒక ఇల్లు వచ్చేలా కృషి చేసి జీవనోపాధికి ట్రై సైకిలను ఇప్పించవలసిందిగా వల్లెపు శ్రీనివాసరావు కోరుతున్నాడు.