చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ మరియు సిబ్బంది మంగళవారం రాత్రి మండలంలోని తాతపూడి జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును ఆపి సోదాలు నిర్వహించగా, ఒక ప్రయాణికుడి వద్ద భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు.
నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి వద్ద రూ. 45,30,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుల గురించి విచారించగా, బంగారం కొనుగోలు చేసేందుకు చెన్నై వెళ్తున్నానని సదరు వ్యక్తి తెలిపాడు. అయితే, నగదుకు సంబంధించి ఎటువంటి సరైన పత్రాలు లేదా ఆధారాలు చూపించకపోవడంతో, ఆ మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనంతరం, సీజ్ చేసిన నగదును తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్) శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అక్రమంగా నగదు రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

