చిలకలూరిపేట: మూడునెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కొండవీడు అభివృద్ధి కోసం ఒక్క అటవీశాఖకే రూ.కోటి నిధులను ప్రభుత్వం కేటాయించిందని, సంబంధిత పనులు మరో 10, 15 రోజుల్లో ఆరంభం కానున్నాయని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో ఎమ్మెల్యే శనివారం జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం రూ.కోటి కేటాయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ కొండవీడులో ఒక్క అటవీ శాఖ తరఫునే మొత్తం రూ.14 కోట్ల విలువైన పనులు చేపట్టబోతున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7 కోట్ల విలువైన అంచనాలు తయారుచేసి ఆర్థిక శాఖకు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.కోటి నిధులు విడుదలయ్యాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొండవీడు కొండపై మొత్తం 101 పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ పనుల కోసం ఈ ఏడాదికి రూ.8 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ప్రభుత్వం ఈ నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది కొండవీడు ఘాట్ రోడ్డు ప్రారంభంలో చెక్‌పోస్టు నిర్మాణం, సైన్ బోర్డులు, అతిథుల కోసం ప్రత్యేక షెల్టర్లు, చైన్ లింక్ ఫెన్సింగ్, ఎంట్రి అర్చివ్, టికెట్ కౌంటర్, కొండపై టాయిలెట్లు, రెస్ట్ రూంలు, బోటింగ్, పార్కింగ్, అత్యాధునిక గ్రీనరీ వ్యవస్థ, చెరువుల ఆధునికీకరణ,వాటర్ ట్యాంక్, ఆర్‌వో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తదితరాల నిర్మాణాలు వెనువెంటనే చేపడతామని తెలిపారు. లాక్‌డౌన్ అయిపోగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొండవీడులో పనులన్నీ కళాత్మకంగా చేయాల్సి ఉందని, ఉత్తర భారత దేశం నుంచి నిపుణులను తీసుకొచ్చి వారి తోనే పనులు చేయించాల్సి ఉందని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఉత్తరభారతదేశం నుంచి కూలీలను రప్పించడంలో ప్రస్తుతం కొంత ఇబ్బంది నెలకొన్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ అయిపోగానే పనులు ముమ్మరంగా చేపడతామని వెల్లడించారు.వైఎస్సార్ స్మృతి వనం ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించండి.ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధి గురించి ఆలోచించిన మొదటి నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. ఆయన పేరుతో కొండపై స్మృతి వనాన్ని నిర్మించే అవకాశాలను పరిశీలించాలని డీఎఫ్‌వోను కోరారు. అవసరమైతే వైఎస్సార్ విగ్రహాన్ని తాము తెప్పించి ఇస్తామని, వనాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. స్పందించిన డీఎఫ్‌వో ఒక చెరువను అభివృద్ధి చేసి వైఎస్సార్ స్మృతి వనాన్ని ఏర్పాటుచేయొచ్చని తెలిపారు. కొండవీడుకు వచ్చే ప్రతి ఒక్కరూ 400 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లుగా ఉండాలని, కొండవీడు రాజదర్పం అక్కడ కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని కోరారు.
May 22, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఎమ్మెల్యే రజిని గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారితో ప్రత్యేక సమావేశం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

