728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2020

ఎలాంటి నిర్మాణాలూ వద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి:
★ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ/స్థానిక సంస్థల నేతృత్వంలో నడుస్తున్న పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టరాదని, సంబంధంలేని, పాఠశాల వాతావరణం దెబ్బతినే కార్యకలాపాలేవీ నిర్వహించరాదని హైకోర్టు ఆదేశించింది.

★ రాజ్యాంగంలోని అధికరణలు 21, 21ఏ చిన్నారులకు విద్యాహక్కు కల్పించిందని, తగిన సదుపాయాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆటస్థలం, ఆరోగ్యకర వాతావరణం విద్యాహక్కులో మిళితమైవున్నాయని పేర్కొన్న హైకోర్టు.. చిన్నారులకు వీటిని కల్పించకుండా విద్యాహక్కు కల్పన అసాధ్యమని స్పష్టంచేసింది.

★ ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, పాఠశాల విద్యాశాఖ, పురపాలక శాఖలను ఆదేశించింది.

★ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

★ ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

★ విశాఖ జిల్లా చీడికాడ మండలం తిరువోలులోని మండల ప్రాథమిక పాఠశాల ఆటస్థలంలో గ్రామ సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని, దీనికోసం మైదానంలోని వృక్షాలను సైతం నరికేశారని పేర్కొంటూ పాఠశాల పూర్వ విద్యార్థులైన బి.కోటేశ్వరరావు, పి.సురేష్‌ తదితర 12 మంది హైకోర్టును ఆశ్రయించారు.

★ ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డాక్టర్‌ పీబీ విజయకుమార్‌ వాదనలు వినిపించారు.

★ పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయం నిర్మించడంవల్ల రోజూ రాజకీయ నేతలతోపాటు వందలాదిమంది వచ్చిపోతుంటారని, దీనివల్ల స్కూలు వాతావరణం దెబ్బ తింటుందని పేర్కొన్నారు.

★ పాఠశాలల్లో విద్యా వాతావరణం దెబ్బతినకుండా సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.

★ అందువల్ల పాఠశాల ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన కట్టడాన్ని అడ్డుకోవాలని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.

★ ఎంపీడీవో, విశాఖ జిల్లా జడ్‌పీపీ, తిరువోలు పంచాయతీ కార్యదర్శి తరఫు స్టాండింగ్‌ కౌన్సిల్‌ వాదనలు వినిపిస్తూ.. స్కూలు కమిటీ తీర్మానం తర్వాతే గ్రామసచివాలయం నిర్మించాలని నిర్ణయించారని వివరించారు.

★ ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సమస్య ప్రాముఖ్యత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా కమిషనర్‌, పురపాలక పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌ పరిపాలన డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చాలని ‘సుమోటో’గా నిర్ణయించారు.

★ ఆ మేరకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

★ తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు తిరువోలు మండల ప్రాథమిక పాఠశాలలో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టరాదని ప్రతివాదులను ఆదేశించారు.

★ అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/స్థానిక సంస్థల నేతృత్వంలో నడుస్తున్న పాఠశాలలన్నింటిలోనూ ఎలాంటి ఇతర నిర్మాణాలు చేపట్టరాదని తేల్చి చెప్పారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎలాంటి నిర్మాణాలూ వద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE