గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో సాగునీటి సమస్యలకు పరిష్కారం, కష్టాలు లేని వ్యవసాయం లక్ష్యంగా ఎమ్మెల్యే సోమవారం ఇరిగేషన్, ఐడీసీ, డ్రెయినేజి, గ్రౌండ్‌వాటర్ టేబుల్, హార్టీకల్చర్, వ్యవసాయ, నాగార్జునసాగర్ కాలువల అధికారులందరితో కలిసి గుంటూరులోని కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో సాగునీటి వనరులు పూర్తిస్థాయిలో పెంచాలనేది తన లక్ష్యమన్నారు. ఇందుకోసం ఈ సమావేశం ద్వారా తాను కొన్ని సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ప్రభుత్వం నుంచి తాను నిధులు విడుదలయ్యేలా చూస్తానని కోరారు. గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి ఏడాది తమ నియోజకర్గంలో పంట నష్టం (క్రాప్ ఫెయిల్యూర్) జరుగుతోందన్నారు. దీన్ని నివారించాలని చెప్పారు. తమ నియోజకర్గంలోని మూడు మండలాల్లో కలిపి 78,656 ఎకరాల వ్యవసాయభూమి ఉందని, అందులో 13,217 ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టులు ద్వారా, 1331 ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతోందని, మిగిలిన 64,106 ఎకరాల భూమికి వర్షపు నీరే దిక్కని ఆవేదన వ్యక్తంచేశారు. అంటే మొత్తం భూమిలో 85 శాతం వర్షాధారంతోనే సాగవుతోందని చెప్పారు. తమ నియోజకవర్గంలో ఉప్పవాగు, నక్కవాగు, కుప్పగంజివాగు, ఓగేరువాగు ఉన్నాయని, వీటిపై ఆధారపడి పెద్దపెద్ద చెరువులు నిర్మించుకునే అవకాశాలను పరిశీలించాలని కోరారు. వర్షాకాలంలో ఈ వాగుల గుండా పెద్ద మొత్తంలో వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ వాగులకు సమీపంలో చెరువులు నిర్మించి, వరదనీటిని ఈ చెరువుల్లో నిల్వ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇలా చేయగలిగితే వేసవిలోనూ ఈ వాగుల్లో నీటి ప్రవాహం ఉండేలా చేయొచ్చన్నారు. వాగులపై చిన్న చిన్న చెక్‌డ్యాంలు కట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. డ్రయినేజి డివిజన్ ఆఫీసు చీరాలలో ఉందని, 1,2,3 సబ్ డివిజన్ కార్యాలయాలు కూడా చీరాల నుంచే పనిచేస్తున్నాయని, సబ్ డివిజన్ - 2 పూర్తిగా తమ నియోజకవర్గ పరిధికి సంబంధించినదేనని వివరించారు. ఈ రెండో సబ్‌డివిజన్ కార్యాలయాన్ని చిలకలూరిపేటకు తరలించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా తుర్లపాడు మేజర్ కెనాల్, పసుమర్రు మేజర్ కాలువలను పొడిగిస్తానని హామీ ఇచ్చారని, సంబంధిత ప్రతిపాదనలు తయారుచేయాలని నాగార్జునసాగర్ కాలువల అధికారులను ఎమ్మెల్యే కోరారు. కొమ్మాలపాడు మేజర్ నుంచి పసుమర్రు మేజర్‌ను కలుపుతూ తవ్వాల్సిన కాలువ ఎందుకు ఆగిపోయిందో తనకు తెలీదని, కానీ ఇది కార్యరూపం దాల్చాలని తెలిపారు. ఆయా కాలువల నిర్మాణానికి కావాల్సిన నిధులను తాను తెప్పించుకుంటానని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఐడీసీ అధికారులు సరిగా అందుబాటులో ఉండటంలేదని, విధుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని, పరిస్థితి మారాలని హితవు పలికారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల అవసరం ఎక్కడెక్కడ ఉందో గుర్తించి, అంచనాలు రూపొందించాలన్నారు. గ్రౌండ్ వాటర్ టేబుల్ విభాగం అధికారులతో మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయన్నారు. ఈ సమస్య ఎక్కడ తీవ్రంగా ఉందో గుర్తించి వాటర్ లెవల్స్ పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఏపీఐడీసీ, డ్రెయినేజి, సాగర్‌కెనాల్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్ విభాగాల ఉన్నతాధికారులు అంతా పాల్గొన్నారు.
June 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ప్రతి ఎకరాకు సాగునీరు అందాలి: ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

