చిలకలూరిపేట: తాము కడుతున్నది ఇళ్లు కాదని, ఊళ్లని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. యడ్లపాడు మండలం చంఘీస్‌ఖాన్ పేట లే అవుట్ లో శుక్రవారం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏక కాలంలో 30 లక్షల కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలోనే తమదేనని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం రూ.1.8 లక్షలు ఇస్తోందని చెప్పారు. ఆయా ఇళ్లకు మంచినీళ్లు, కరెంటు, కాలువలు.. తదితర మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో ఇంటికి మరో రూ.1.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ప్రజల గుండెల్లో ఉండిపోయే ప్రభుత్వం తమదని వెల్లడించారు.
తొలి విడతలో 5041 ఇళ్లు
నియోజకవర్గంలో మొత్తం 22వేల మందికి కొత్తగా ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నామని చెప్పారు. తొలి విడతలో 11వేల మందికి ఇళ్లు నిర్మిస్తుండగా.. మొదటి దశ కింద తొలి ఆరు నెలల్లో 5041 ఇళ్లు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. యడ్లపాడు మండలంలో 436, చిలకలూరిపేట పట్టణ పరిధిలో 4,965 ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మొత్తం 5,041 మందికి ఇప్పటికిప్పుడు ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీవాసునుపూర్ అజయ్ కుమార్, తహశీల్దార్ శ్రీనివాసరావు, హోసింగ్ డీఈఈ, మున్సిపల్ చైర్మన్ రఫాని, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, ఎడ్లపాడు మండల అధ్యక్షుడు కల్లూరి బుజ్జి, జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు, గ్రామ సర్పంచ్ మల్లవరపు పోలవతి, గ్రామ నాయకులు బసల శివరామకృష్ణ, చట్రాజ్ పల్లి శ్రీనివాసరావు, బసల కృష్ణమూర్తి మరియు పలువురు పాల్గొన్నారు.


