నరసరావుపేట: కృష్ణా జలాలపై బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి మరలింపుతో ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఒప్పందాలకు అనుగుణంగా నీటి తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాడకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ బోర్డు ఒప్పందాలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని మరలించి ఏకపక్షంగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని, దీంతో ఆంధ్రప్రదేశ్ లో సాగు, తాగు నీటికి ఎద్దడి ఏర్పడుతోందని.. కేంద్రం చర్యలు తీసుకోవాలని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ సకావత్ కు ఎంపీ లేఖ రాశారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. పులిచింతల, శ్రీశైలం, నాగార్జున రిజర్వాయర్ల నీటి వాడకాన్ని క్రమబద్దీకరించుటకు రెండు రాష్ట్రాల మధ్య 2014 లో ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతులు, ఆదేశాలు లేకుండానే తెలంగాణ..శ్రీశైలం నుంచి 4 టీఎంసీలు, సాగర్ నుంచి 3టీఎంసీలు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలు నీటిని ప్రతి రోజు వినియోగించుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటితో విద్యుత్ ను ఉత్పత్తి చేయటం వల్ల నీరు వృధా అయ్యి, నెల్లూరు, ప్రకాశం గుంటూరు జిల్లాల రైతుల మనుగడకు తీవ్ర విఘాతం కల్గుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా 110 టీఎంసీల నీటితో గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు వరి, మిర్చి పంటలను పండిస్తున్నారని, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని రైతులందరూ పూర్తిగా సాగర్ కుడి కాల్వ నీటి పై ఆధారపడి.. 1.2లక్షల హెక్టార్ల లో మిర్చి, పత్తి, వరి, పసుపు తదితర పంటలను పండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బోర్డ్ అనుమతులు లేకుండా కృష్ణా నీటిని మరలించటంతో ఈ ప్రాంతాలు నీటి ఎద్దడికి గురి కాబడి రైతులు తక్కువ దిగుబడులు ఇచ్చే పంటలను సాగు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీని వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు నష్ట పోతారాని.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం చేస్తున్న నీటి తరలింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జలశక్తి శాఖ మంత్రిని కోరారు.
July 6, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఉమ్మడి ప్రాజెక్టులకు CISF బలగాలతో రక్షణ కల్పించండి: ఎంపీ లావు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

