యడ్లపాడు మండలం చెంగీజ్ఖాన్పేట పంచాయతీలోని సంగం గోపాలపురం (ఎస్టీ) కాలనీలో శుక్రవారం గుడిసె దగ్ధం అయింది. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే కోలా అంజయ్యకు కాలనీలో పక్కా ఇల్లు ఉంది. దాని పక్కనే ఓ గుడిసెను వేసుకున్నాడు. నివాసం అంతా పక్కా ఇంట్లోనే అయినా నిద్రపోయేది మాత్రం గుడిసెలోనే. రోజు మాదిరిగా గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని అంజయ్య, వెంకాయమ్మ దంపతులు గుడెసెలో నిద్రకు ఉప క్రమించారు.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో గుడిసెనుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో గుడిసలోని ఉన్న అంజయ్య, వెంకాయమ్మలు పరుగున బయటకు వచ్చారు. కొద్ది సేపటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. గుడిసెతో పాటు బట్టలు, మంచాలు మాత్రమే ఉన్నాయని అవన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయనట్లు బాధితులు తెలిపారు.
