చిలకలూరిపేట ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలలో ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులు జగనన్న గృహహక్కు పథకంలో భాగంగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద గ్రామీణప్రాంతాలవారు రూ.10వేలు, పట్టణ ప్రాంతాలవారు రూ.15వేలు, నగరపాలకసంస్థలో రూ.20వేలు చెల్లించి శాశ్వత గృహహక్కు పొందాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సూచించారు.
చిలకలూరిపేట పట్టణంలో ఓటీఎస్ మెగా మేళాలో కలెక్టర్ వివేక్‌యాదవ్ పాల్గొని ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13వేలమంది లబ్దిదారులు ఓటీఎస్ కింద నగదు చెల్లించారని, చిలకలూరిపేట మునిసిపాలిటీలో 370మంది చెల్లించారన్నారు. వారందరికీ ఈనెల 6 లేదా 8వ తేదీ నుంచి ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి శాశ్వత గృహహక్కు కల్పించడం జరుగుతుందన్నారు. శాశ్వత గృహహక్కు పత్రాలతో బ్యాంకులలో రుణాలు కూడా తీసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. అధికారులపై తాము ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని, లబ్దిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నగదు చెల్లించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వసంతబాబు, మునిసిపల్ చైర్‌పర్సన్ షేక్ రఫాని, కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ జి.సుజాత, ముస్లిం మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, మునిసిపల్ డీఈ రహీమ్, మునిసిపల్ కౌన్సిలర్‌లు బేరింగ్ మౌలాలి, షేక్ కరిముల్లా, అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, చెంబేటి భారతి తదితరులు పాల్గొన్నారు.
