చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి మార్టూరు మధ్య జాతీయ రహదారి పక్కన ఓ డాబా హోటల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ 25 లక్షలు చోరీకి గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం వింజనంపాడు గ్రామానికి చెందిన పుసులూరి ఆంజనేయులు రూ 25 లక్షల నగదు బ్యాగులో పెట్టుకుని ఆటోలో చిలకలూరిపేట ఎన్ ఆర్ టి సెంటర్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ ఆఫీస్ వద్ద కు రాత్రి 7:45 సమయంలో వచ్చారు. అక్కడ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బెంగళూరుకి బయలుదేరాడు. బస్సు చిలకలూరిపేట మండలం బొప్పూడి మార్టూరు మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఓ డాబా హోటల్ వద్ద భోజనానికి ఆపాడు. ఆంజనేయులు నగదు ఉన్న బ్యాగును తన సీటు వద్ద ఉంచి కిందకు దిగాడు. తిరిగి రెండు నిమిషాలలో బస్సు ఎక్కాడు. అంతలోనే బ్యాగులో ఉన్న రూ 25 లక్షల నగదు మాయమయ్యాయి. ఇదిలా ఉంటే ఆంజనేయులు బెంగళూరులో విద్యార్థులు ఉండే అద్దె వసతి గృహాలు నిర్వహిస్తుంటారు. ఆయన కుమారుడు నరేంద్ర కూడా బెంగళూరులోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇటీవల ఆంజనేయులు స్వగ్రామం వింజనంపాడుకు వచ్చాడు. నరేంద్ర తన పేరుతో బెంగళూరులో ఉన్న ఓ స్థలాన్ని యూకే లో ఉంటున్న మిత్రుడికి విక్రయించాడు. దానికి సంబంధించిన నగదు యూకే కరెన్సీని మిత్రుడు పంపారు. దానిని చిలకలూరిపేటకు చెందిన వారు నగదు రూపంలో రూ 25 లక్షలు వింజనంపాడు గ్రామానికి వెళ్లి అతని తండ్రికి సోమవారం ఇచ్చారు.
వాటిని తీసుకొని బెంగళూరు బయలుదేరిన ఆంజనేయులు బ్యాగులో నుంచి బస్సు ఆగిన సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఆంజనేయులు ఎక్కిన బస్సు చిలకలూరిపేట నుంచి ఒక కారు ఫాలో అవుతున్నట్లు, ప్రైవేటు ట్రావెల్ బస్సులో సీసీ కెమెరా పనిచేయకుండా గమ్ అతికించి ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు ఆంజనేయులు బస్సు దిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు బస్సు లోకి వెక్కి ఆయన బ్యాగులోని నగదు సంచిని తీసుకొని వెళ్ళిపోయినట్లు ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పినట్లు సమాచారం. తమకు నగదు పోయినట్లు ఇంకా ఫిర్యాదు అందలేదని.. బాధితుడు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు తెలిపారు

