బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం గుంటుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి భానుప్రకాష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పీహెచ్‌సీని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలో నిర్వహణ లోపాలను గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రి పరిధిలోని పలువురు ఏఎన్ ఎంలు మంత్రి వద్దకు చేరుకుని తమతో మెడికల్ ఆఫీసర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిసస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు సైతం వైద్యాధికారి విధులకు సరిగా రావడంలేదని, పనివేళ్లలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నాడని ఆరోపించారు. స్పందించిన మంత్రి వెంటనే భానుప్రకాష్‌ను విధుల నుంచి తప్పించాలని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ వెంటనే మెడికల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాలనాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.
సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలి...
ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ సందర్భంగా మంత్రి ఓపీ విభాగంతోపాటు వార్డు, ఆపరేషన్ థియేటర్, మందుల విభాగం, లేబర్ రూమ్‌లను పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో మందులు సరిపడా ఉన్నాయని మంత్రి చెప్పారు. మెడికల్ కిట్లు కూడా సరిపడా ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ కూడా ఆస్పత్రిలో సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం రోగులకు కావాల్సినవన్ని సమకూరుస్తున్నదని, ఆస్పత్రిలో నిల్వ ఉన్న మందులు, టీకాలే అందుకు నిదర్శనమని చెప్పారు. వైద్య పరికాలు కూడా ఆస్పత్రికి తగినట్లుగా అన్నీ ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రులకు ఏది కావాలంటే అది చేస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని, వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి జగనన్న ప్రత్యేక దృష్టితో చూస్తున్నారని పేర్కొన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళుతుంటే క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండటం బాధాకరమని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రులను వినియోగించుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు మించి మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న నాడు- నేడు కింద ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రాథమైక వైద్య విభాగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ఉచితంగా అన్ని రోగాలకు గ్రామస్థాయిలోనే చికిత్స అందేలా చేసేందుకు వేల కోట్ల రూపాయలను జగనన్న ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గుంటుపల్లి ప్రభుత్వాస్పత్రికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని తెలిపారు.అద్దంకి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త బాచిన కృష్ణచైతన్య , కుటుంబసంక్షేమం కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ నివాస్ , డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రామిరెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.






