చిలకలూరిపేట పట్టణ పరిధిలోని ఓగేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చిలకలూరిపేట పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగింది.
చిలకలూరిపేట పట్టణంలోని బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన రమేష్ , స్రవంతిల కుమారుడునూతల పాటి కార్తీక్ (14), దాసరి బజారుకు చెందిన బాజిబాబు కుమారుడు పి. మోహనసాయి అనీష్(13)లు స్నేహితులు. నూతలపాటి కార్తీక్ స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు.
మోహన సాయి అనీష్(13) మరో ప్రైవేటు పాఠశాలలో ఎడవతరగతి చదువుతున్నారు. వీరు సోమవారం క్రికెట్ ఆడటానికి వెళ్లారు. అనంతరం అక్కడకు సమీపంలోని ఓగేరువాగులో ఈతకు దిగారు. పట్టు తప్పి వాగులో కొట్టుకుపోతుండగా కేకలు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారిద్దరినీ వాగులో నుంచి బయటకు తీసుకువచ్చారు. వారిద్దరని ముందుగా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


