చిలకలూరిపేట: పట్టణానికి తాగునీటి సరఫరా అయ్యే
మంచి నీటి చెరువు లో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన నల్లూరి అనిల్(30) మంగళవారం సాయంత్రం చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడి గల్లంతయ్యాడు. అధికారులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువుకు ప్రస్తుతం నీరు పెడుతున్నారు. అధికారులు చెరువుకు నీరు పెట్టడం నిలిపివేశారు. చెరువు నిండా నీరు ఉండటంతో స్థానికంగా గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది.చిలకలూరిపేట రూరల్ ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో చెరువు వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు చేయిస్తున్నారు. ఎన్‌డిఆర్ ఎఫ్ బృందాన్ని పిలిపించి గాలింపు చర్యలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గల్లంతయిన యువకుడు మార్బుల్ పని చేస్తాడని సమాచారం. మరో యువకుడితో కలసి అతను చేపల వేటకు వెళ్లినట్లు తెలిసింది. గల్లంతయిన యువకుడికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని బంధువులు, వైఎస్సార్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.

