728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 19, 2024

ప్రధాని సభకు అన్ని భద్రతా లోపాలే... విచారణ జరపాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి డిమాండ్


 చిలకలూరిపేట: 

బొప్పూడి సభలో భద్రతా లోపాలు పూర్తిగా అధికార పార్టీ కుట్రే అని ఆరోపించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. స్వయంగా ప్రధానమంత్రి పాల్గొన్న సభ విషయంలో కూడా వైకాపా ఇలా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి లోతైన కుట్రలు దాగివున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, వైకాపా సేవలో తరిస్తున్న పోలీసులను పక్కనబెట్టాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు, ప్రచారాలను దృష్టిలో పెట్టుకొనే గతంలో జీవో 1ను తీసుకొచ్చి విపక్షాల గొంతునొక్కాలని చూశారన్నారు. అసలు విపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలు జరగకుండా చూడాలని కుట్రలు చేశారని మండిపడ్డారు. ఇబ్బందులు సృష్టించడం, అవాంఛనీయ ఘటనలు జరిగితే విపక్షాలపై నిందలు వేయడమే వారి దురాలోచనగా కనిపిస్తోందని అన్నారు. ఆ నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక జీవోను కోర్టులు అడ్డంగా కొట్టేశాయని వెల్లడించారు. అందుకే ఇప్పుడు విపక్ష సభలను మరో రూపంలో అడ్డుకోవాలని, అలజడులు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని సభలో మూడుసార్లు కరెంట్ పోవడం, ప్రధాన వేదిక వద్ద భద్రతను సరిగా పట్టించుకోకపోవడం, ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేయడం.. ఇవన్నీ కావాలని చేసినట్లే కనిపిస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్‌ తన సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకే కీలక జిల్లాల ఎస్పీలుగా పోస్టింగ్‌లు ఇచ్చి ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై తాము ఎంతోకాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. విపక్షాలకు కీలకమైన భారీ బహిరంగ సభ పర్యవేక్షణా బాధ్యతలు పరమేశ్వర్‌రెడ్డి, తిరుమలేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, మాధవరెడ్డికి అప్పగించడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు ప్రత్తిపాటి. ప్రధాని భద్రత, జనం రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఎందుకు పట్టించుకోవలేదో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీజీపీని తొలగించి పోలీస్ వ్యవస్థ మొత్తం ఈసీ ఆధీనంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి కోరారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రధాని సభకు అన్ని భద్రతా లోపాలే... విచారణ జరపాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి డిమాండ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE