చిలకలూరిపేట: ఆటోల్లో ప్రయాణికుల్లా ప్రయణిస్తూ , ప్రయాణికులను మభ్యపెట్టి మూడు బిల్లలాట ఆడించి, వారి నుంచి డబ్బులు, విలువైన వస్తువులు దోపిడి చేసే ఐదుగురు సభ్యులున్న దొంగల ముఠాను రూరల్ సీఐ బి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 28వ తేదీ బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి తండాకు చెందిన బానావతు రాంబాబు నాయక్, తన రామావత్ బాబునాయక్‌తో కలసి చిలకలూరిపేట గొర్రెల మండిలో తన 16 పొట్టేళ్లు అమ్మారు. తద్వారా వచ్చిన రూ. 1,15లక్షలను తీసుకొని స్వగ్రామానికి వెళ్లటానికి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. దొంగల ముఠా పథకం వీరిని ఆటోలో ఎక్కించుకొని మార్గ మధ్యలో మూడు బిల్లల ఆట ఆడించారు. వారి వద్ద నుంచి రూ. 17,500 లాక్కొని రామచంద్రాపురం పరిధిలోని మంగళపాలెం డొంక వద్ద ఆటోనుంచి నెట్టివేసి పరారయ్యారు. ఈవిషయంపై బాధితుడు రాంబాబు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాలతో నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో రూరల్ సీప బి సుబ్బానాయడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చేశారు. మంగళవారం చిలకలూరిపేట మండలం కావూరు వద్ద ఉన్న నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన బండారు ఏడుకొండలు, అదే గ్రామానికి చెందిన శివరాత్రి నాగేంద్రబాబు, జట్టిపాటి నాగరాజు, జెట్టిపాటి శ్రీను ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ 16వేలను రికవరీ చేశారు. నిందితులపై వీరిపై నరసరావుపేట, పిడుగురాళ్ల, అద్దంకి తదితర ప్రాంతాలలోనూ కేసులు నమోదై ఉన్నాయని డీఎస్సీ నాగేశ్వరరావు తెలిపారు.
ఫిర్యాదుదారులు నిజాయితీగా వ్యవహరించాలి.. కె నాగేశ్వరరావు, నరసరావుపేట డీఎస్పీ
ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన వద్ద నుంచి ముద్దాయిలు రూ. 1.15లక్షలు కాజేశారని ఫిర్యాదు చేశాడని, అనంతరం విచారణలో రూ. 17,500 మాత్రమే దోపిడి జరిగినట్లు తెలిందని డీఎస్సీ నాగేశ్వరావు తెలిపారు.. ఫిర్యాదు చేసే క్రమంలో ఫిర్యాదు దారులు నిజాయితీగా వ్యవహరించి జరిగిన విషయాన్ని, పోగొట్టుకున్న సొమ్ము వివరాలు అందజేయాలని సూచించారు. అలా కాని పక్షంలో పోలీసుకు తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేస్తే వారిపై కూడా చర్య తీసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ కేసును చాకచౌక్యంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్న రూరల్ సీఐ బి సుబ్బానాయడు, సిబ్బందిని డీఎస్సీ కె నాగేశ్వరరావు అభినందించారు.