చిలకలూరిపేటలో పాత కక్షలతో : వ్యక్తిపై కత్తితో దాడి
చిలకలూరిపేట పట్టణంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. పట్టణంలోని అడ్డరోడ్డు సమీపంలో గురువారం ఒక వ్యక్తిపై ప్రత్యర్థి కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు మరియు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణము సుభాని నగర్ కు చెందిన జానీ భాషా తాపీ మేస్త్రి అనే వ్యక్తిపై గుర్రాల చావిడి ప్రాంతానికి చెందిన బషీర్ అనే వ్యక్తి పాత కక్షలను మనసులో పెట్టుకొని కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో జానీ భాషా శరీరానికి తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు.
పరిస్థితి విషమం:
సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయాలు లోతుగా ఉండటం మరియు రక్తస్రావం ఎక్కువగా కావడంతో జానీ భాషా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

