728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా రాంరాం

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్‌వోకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్‌ చెప్పారు.

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనాపౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అలాగే అమెరికాలో చైనా పెట్టుబడుల విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ప్రకటించారు. హాంకాంగ్‌ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంటు ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ గురువారం ఆమోదించడంపైనా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాంకాంగ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు స్వస్తి పలకనున్నామని తెలిపారు. 1984లో బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తోందని చెప్పారు.

గత కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ట్రంప్‌ ఆరోపించారు. మేధో హక్కులతో పాటు బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడుల్ని అక్రమ మార్గాన మళ్లించుకుందన్నారు. అలాగే ఉద్యోగాల్లో సైతం అమెరికా నిబంధనల్ని అతిక్రమించిందని ఆరోపించారు. వాణిజ్యం విషయంలోనూ ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిబంధనల్ని పాటించలేదని విమర్శించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. చైనాతో అమెరికా ఎప్పటికీ నిర్మాణాత్మక బంధాన్నే కోరుకుంటోందని.. కానీ, అందుకోసం దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడలేమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా రాంరాం Rating: 5 Reviewed By: NEWS UPDATE