చిలకలూరిపేట: అర్హులందరికీ చేనేత నేస్తం అందాలని, అధికారులు సహకరించాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని సూచించారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే విడదల రజిని చేనేత శాఖ అధికారులు, లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో లోపాలు జరుగుతున్నాయని లబ్ధిదారులు వాపోతుండటంతో ఎమ్మెల్యే ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేతన్న నేస్తం లబ్ధిదారులను గుర్తించడంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తమ నియోజకవర్గానికి సంబంధించి చిలకలూరిపేట పట్టణంలో మార్కండేయనగర్, భావనారుషి నగర్, పండరీపురం, పద్మశాలిపేట, గణపవరం, చిలకలూరిపేటరూరల్ మండలం యడవల్లి, పోతవరం, రాజాపేట, లింగంగుంట్ల, నాదెండ్ల మండలం గణపవరం తదితర గ్రామాల్లో దాదాపు 300 వరకు కుటుంబాలు చేనేత పనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. మగ్గాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. కొత్తగా ఎవరైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలో నేతన్న నేస్తం కోసం కొత్తగా 90 దరఖాస్తులు నమోదైనట్లుగా తన దృష్టకి వచ్చిందని, వీరిలో అర్హులైనవారందరికీ లబ్ధి కలిగేలా చూడాలని కోరారు. తమ నియోజకవర్గంలో గత డిసెంబరులో ఎవరికైతే లబ్ధి కలిగిందో వారందరికీ ఈ ఏడాది రెండో విడత సాయం కూడా వచ్చేలా చూడాలన్నారు. ఈ పథకాన్ని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని, ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ వనజాక్షి, క్షేత్రస్థాయి సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
June 4, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అర్హులందరికీ నేతన్న నేస్తం అందాలి: ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

