🔹దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను తాము అందిస్తున్నామని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం గ్రామంలో సోమవారం మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
🔹తొలుత చెత్త ప్రాసెసింగ్ యూనిట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సభను నిర్వహించారు. చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం- మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్లే లెక్క అని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే క్రిములు, కీటకాలు తయారవుతాయన్నారు. దీనివల్ల డయేరియా, మలేరియా, డెంగీ, కలరా తదితర ప్రమాదకర రోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి సమస్యలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు.
🔹రాష్ట్రవ్యాప్తంగా మండలానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద ఆయా గ్రామాల్లో మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. యడ్లపాడు మండలంలో గుత్తావారిపాలెంతోపాటు దింతెనపాడు గ్రామాలను ఎంపికచేసినట్లు తెలిపారు. మన ఇళ్లలో, మన పెరట్లో, మన కొష్టాల్లో వచ్చే చెత్తాచెదారం, పేడ కుప్పలు ఇలాంటి వాటన్నింటినీ గ్రామంలోని సిబ్బందే వచ్చి తీసుకెళతారని, అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని వివరించారు.
🔹తోపుడు బండ్ల ద్వారా చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేస్తారని చెప్పారు. ఇకపై పేడ దిబ్బలు, పేడ తట్టలు, వాటిని నెత్తిన పెట్టుకుని మోయడాలు మన గ్రామంలో కనిపించవని తెలిపారు. మీ కొష్టాల్లో నుంచి తీసుకుని వెళ్లిన పేడను నిష్పత్తి ప్రకారం ప్రాసెసింగ్ చేసిన పేడను తిరిగి ఇచ్చేస్తారని వెల్లడించారు. దీన్ని ఎరువుగా పొలాల్లో వాడుకోవచ్చని చెప్పారు. ఇకపై ఎక్కడా చెత్తా చెదారం రోడ్లపై కనిపించకూడదని తెలిపారు.. అలా కనిపించకుండా చూడాల్సిన బాధ్యతను వాలంటీర్లు, సెక్రటరీలు తీసుకోవాలన్నారు.
🔹ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గ్రామస్తులు సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తే.. ఈ మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని అన్ని గ్రామాలకు తీసుకెళ్లే వీలవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.మాధురి, మండల పరిషత్ సిబ్బంది, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లూరి బుజ్జి, కారుచోల, గుత్తావారిపాలెం గ్రామాల నాయకులు వీరారెడ్డి, భూషయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

