చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ.. బంగారు మొలతాడు పట్టుదట్టి.. సందిట తాయోత్తులు సరిమువ్వ గజ్జెల... చిన్నికృష్ణా నిన్ను చేరి కొలుతుము.. అని భక్తలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసేందుకు నిరీక్షించినా కరోనా ప్రభావంతో అంతరాలయంలోనే బాలకృష్ణుని జన్మదినోత్సవమైన గోకులాష్టమిని ఘనంగా నిర్వహించారు సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని "గోకులాష్టమి", "అష్టమి రోహిణి", "శ్రీకృష్ణ జన్మాష్టమి", "శ్రీకృష్ణ జయంతి", "శ్రీ జయంతి", "సాతం ఆతం", "జన్మాష్టమి" - ఇలా రకరకాలుగా స్వామివారిని పూజించనున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారాయణతో ముగిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు. కృష్ణ లీలలకు అంతేముంది? ఎవరైనా, ఎన్నయినా తలచుకోవచ్చు.

