నాదెండ్ల: గణపవరం శివార్లలో మహిళా రైతు వలేటి రాఘవమ్మ పొలంలో తొలి ఉచిత బోరు. రైతన్నకు సిరులపంటను అందించడమే లక్ష్యంగా జలకళ పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలం గణపవరం నుంచి జలకళ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన మహిళా రైతు వలేటి రాఘవమ్మ పొలంలో తొలి బోరును ఎమ్మెల్యే విడదల రజిని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ జానర్ధన్‌రెడ్డి, డ్వామా పీడీ గజ్జెల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జలకళ పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేయడమే కాకుండా కరెంటు కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. మోటారు పైపులు కూడా ఉచితంగా ఇస్తామని, ఒక్కో రైతుకు కనీసం రూ.లక్ష లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మెట్ట రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకాన్ని రైతులంతా వినియోగించుకోవాలని చెప్పారు. పంట పొలాలు ఎండిపోకుండా, నీటి కష్టాలు లేకుండా చేసేందుకు జలకళ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అన్నదాత సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జలకళ పథకానికి సంబంధించి ఇప్పటికే అన్ని సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారని, ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకూ ఈ పథకం ద్వారా బోర్లు వేస్తామన్నారు. పార్టీ, కులం, మతం లాంటి వివక్షలకు తావులేకుండా ప్రతి రైతుకూ న్యాయం చేకూరేలా పనిచేస్తున్నామన్నారు.
చిలకలూరిపేటకు ఎన్ని బోర్లయినా ఇస్తాం: జాయింట్ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి
ఎమ్మెల్యేవిడదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో మెట్ట రైతులు ఎక్కువగా ఉన్నారని, నియోజకవర్గానికి దాదాపు 3వేల బోర్లు అవసరమవుతాయని, ఈ విషయంలో సహకరించాలని జాయింట్ కమిషనర్ జనార్ధనరెడ్డి గారిని కోరారు. స్పందించిన జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎన్ని బోర్లు ఇచ్చేందుకైనా సహకరిస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

