చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో నెంబర్ 581/ ఎస్ఈసి.. ఎఫ్/2 తేదీ 15.2.21 ప్రకారం గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలోని 38 వార్డులలో ఎన్నికలు నిర్వహిస్తారని ఎన్నికల నోటిఫికేషన్ లో ఎస్.ఈ.సి తెలియజేసింది. ఈ నోటిఫికేషన్ తో చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన అనంతరం గణపవరం, పసుమర్రు గ్రామాలకు చెందిన కొంతమంది తమ గ్రామాలు పట్టణ పురపాలక సంఘంలో కలపవద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం దండమూడి గ్రామానికి చెందిన కొంతమంది దండమూడి గ్రామాన్ని పట్టణ పురపాలక సంఘంలో కలపాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పిటిషన్లని మార్చి 3వ తేదీన విచారణ చేపడతాం అని హైకోర్టు తెలియజేసింది.
అయితే పట్టణ పురపాలక సంఘంలో కలిపిన గణపవరం, పసుమర్రు... కలపాలన్న దండమూడి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే న్యాయవాదుల సూచనల ప్రకారం పాత నోటిఫికేషన్ను యధావిధిగా ఎన్నికల కమిషన్ కొనసాగిస్తూ ఉండటం వల్ల నోటిఫికేషన్ అనంతరం హైకోర్టులో వేసిన కేసులు ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని వాదిస్తున్నారు. అదే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే హైకోర్టులో ఉన్న మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు మేరకు ఎన్నికలు నిర్వహించలేరు. చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని... అయితే ఆ గ్రామాలు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది హైకోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ చిలకలూరిపేటలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

