1964లో చిలకలూరిపేట మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుండి, 57 సంవత్సరాల చరిత్ర ఉన్న చిలకలూరిపేట మునిసిపాలిటిలో మున్సిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టడం అన్న ప్రక్రియ ఎన్నడూ జరగలేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మునిసిపాలిటీ ఆస్తులను అభివృద్ధి పేరిట తాకట్టు పెట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే మునిసిపాలిటీని కూడా హోల్ సేల్ గా అమ్మేయదలచుకున్నారా?అని ఘాటుగా ప్రశ్నించారు. గతంలో ఎందరో శాసనసభ్యులుగా, మంత్రులుగా ఈ నియోజకవర్గానికి వ్యవహరించిన సమయంలో, పురపాలక సంఘ అభివృద్ధికి వందల కోట్లలో నిధులను ప్రభుత్వం నుండి తెచ్చి అభివృద్ధి చేసిన పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుత శాసన సభ్యురాలి హయంలో పట్టణంలో అభివృద్ధి పనుల పేరిట కళామందిర్ సెంటర్ లో ఉన్న గాంధీ పార్కు తో పాటు, షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా తాకట్టు పెట్టారని మాకు విశ్వనీయ సమాచారం ఉన్నది. ఒక జాతీయ బ్యాంకు లో గాంధీ పార్క్ ను మరియు షాపింగ్ కాంప్లెక్స్ ను తాకట్టు పెట్టి 50 కోట్ల అప్పు కు ప్రయత్నించడం జరిగింది. సదరు బ్యాంకు వారు గాంధీ పార్క్ విలువ 30 కోట్లుగా నిర్ధారించి, అంత మొత్తం మాత్రమే ఇస్తామని ప్రతిపాదించడం జరిగింది. ఎంత ఇచ్చినా అప్పు తీసుకోవడానికి సిద్ధపడ్డ అధికారులు, 30 కోట్ల అప్పు కు అంగీకరించి, గాంధీ పార్కు ను తాకట్టు పెట్టారు. ఈ విధంగా ఈ రోజు పార్క్, భవిష్యత్తులో మున్సిపాలిటీ కార్యాలయం తర్వాత కౌన్సిల్ హాల్ ను కూడా తాకట్టు పెట్టి, చివరకు కౌన్సిల్ సమావేశాలు చెట్ల కింద నిర్వహించుకుందామా? అని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి పేరిట ఆస్తులను తాకట్టు పెట్టే ఈ నీచమైన ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం అయ్యాక చివరకు మనుషున్ని కూడా తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. వేల కోట్లు నిధులు పట్టణ అభివృద్ధికి తెస్తున్నానని ప్రగల్భాలు, పలుకుతున్న శాసనసభ్యురాలు చివరకు పార్కులు, షాపులను అభివృద్ధి పేరిట తాకట్టు పెట్టించడం సిగ్గుమాలిన చర్య గా కౌన్సిలర్లు అభివర్ణించారు. పట్టణ ప్రజలు కూడా ఈ విషయంలో చైతన్యంగా వ్యవహరించి గాంధీ పార్క్ తాకట్టును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాగే వదిలేస్తే మునిసిపాలిటీకి ఒక్క రూపాయి ఆస్తి కూడా మిగలకుండా తాకట్టులు పెట్టేస్తారు అని తెలిపారు. అభివృద్ధి పేరిట పార్కును తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తక్షణమే గాంధీ పార్క్ తాకట్టు ప్రక్రియను మునిసిపాలిటీ వారు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాదు అని మీరు తాకట్టు పెట్టడానికి ముందుకు వెళితే, పట్టణ ప్రజలను చైతన్యవంతం చేసి, వారితో ఉద్యమించి గాంధీ పార్క్ ను కాపాడుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గంగా శ్రీనివాస రావు( 4వ వార్డు), కొత్త కుమారి (8వ వార్డు), కనమర్లపూడి లక్ష్మీ తిరుమల (21 వ వార్డు), కూనల ప్రమీల (22 వ వార్డు) కంచర్ల కరుణ (23 వ వార్డు), రాయని హరిత (36 వ వార్డు), పాములపాటి శివ కుమారి (37 వ వార్డు), జంగా సుజాత (38వ వార్డు) పాల్గొన్నారు.

