డబ్బులు తీసుకునే ఏటీఎంలను వాడుతున్నాం. ఇటీవల కొన్నిచోట్ల ఔషధాల ఏటీఎంలూ వచ్చాయని విన్నాం. ఇప్పుడు బంగారు నాణాలిచ్చే ఏటీఎంలను చూడబోతున్నాం. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే అవి మూడు చోట్ల అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో బంగారం ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ వెల్లడించారు.
రానున్న 45 రోజుల్లోపు నగరంలోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులనుపయోగించి 99.99 శాతం స్వచ్ఛత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణాలు డ్రా చేసుకోవచ్చని వివరించారు.
