
చిలకలూరిపేటలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ, సీపీఐ, మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలో మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ... ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం మున్సిపల్ కమిషనర్ షేక్ అబ్దుల్ రహీంకు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్మికులను నడ్డి విరిచే ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి పనిభారం పెంచారన్నారు. దీని వలన కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా పోయిందని చెప్పారు. కనీస వేతనం రూ.24,000 అమలు చేయాలని, అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, దినసరి కూలీలను అవుట్‌సోరిం్సంగ్ కార్మికులకు గుర్తించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలీ చాలని జీతాలలో, పెరుగుతున్న అధిక ధరలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,. పట్టణ విస్తీర్ణానికి తగ్గట్టు కార్మికుల సంఖ్యను పెంచాలని, కార్మికుల పనిముట్లు సంఖ్య పెంచడంతోపాటు యూనిఫాం, నూనెలు, సబ్బులు, చెప్పులతోపాటు కుట్టుఛార్జి సక్రమంగా ఇవ్వాలని కోరారు. . రిటైరైన వారికి రూ.5లక్షలు ఇచ్చి, వేతనంలో సగం జీతం పెన్షన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొమ్మతోటి చెంచయ్య , ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు పేలూరి రామారావు, దాసరి వరహాలు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
Advertisements