అమరావతి: మృతదేహాలతో వ్యాపారం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని హెచ్చరించారు. తిరుపతి రుయా ఘటనపై మంత్రి స్పందించారు.
ఘటనపై రుయా సూపరింటెండెంట్ వివరణ కోరినట్లు చెప్పారు. మృతుడి కుటుంబాన్ని ఎవరు బెదిరించారని.. వారు ఆస్పత్రి సిబ్బందా, లేక ప్రైవేటు వ్యక్తులా అనే దానిపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. బాధ్యులను వదిలిపెట్టేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మహాప్రస్థానం వాహనాలు 24 గంటలూ పనిచేసే విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వాహనాల్లోనే మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రీపెయిడ్ ట్యాక్సీ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఆస్పత్రుల వద్ద ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

