చిలకలూరిపేట:
వందల్లో పెట్రో ధరలు పెంచి, రూపాయాల్లో ధరలు తగ్గించామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం శోచనీయమని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి డి మారుతీ వరప్రసాద్ విమర్శించారు. అధిక ధరలను అరికట్టాలని, పన్నుల భారాలను విరమించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా పెట్రో బంకుల వద్ద మూడు రోజుల నుంచి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కరపత్రాలు పంచిపెట్టి, సంతకాలు సేకరించారు. ప్రజలకు పెరిగిన ధరలను గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వరప్రసాద్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం పన్నులు పెంచి లక్షలకోట్ల ఆదాయాన్ని ప్రజల నుండి పన్నుల రూపంలో గుంజుకుంటుందన్నారు. మరొక ప్రక్క బడా పెట్టుబడిదారులకు, కార్పోరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కేంద్రప్రభుత్వం ఇస్తుందని, సెస్, సర్ ఛార్జీలను తక్షణమే రద్దు చేసి, ఎక్సైజ్ సుంకాలు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. చేయడానికి పనుల్లేక పేదరికంలో మగ్గుతున్న ప్రజలు మరొక ప్రక్క ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించేవరకు ప్రజలు పెద్దయెత్తున పోరాటాలకు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలపై వివిధ రూపాల్లో పన్నుల భారాన్ని మోపుతుందని, విద్యుత్ చార్జీలు పెంచి రూ.4300 కోట్ల భారాన్ని మోపిందన్నారు. ఇంటిపన్నులు పెంచి, చెత్త పన్ను విధించిందని తెలిపారు. ఆర్టీసీ చార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పన్నుల పెంపు, నిత్యావసర ధరల పెంపుకు నిరసనగా ఈ నెల 30వ తేదీ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామ సుబ్బాయమ్మ, సీపీఎం డివిజన్ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు పేలూరి రామారావు, దాసరి వరహాలు, మహిళా సమాక్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు సీఆర్ సృజన్, లలిత కుమారి, నాయుడు శివకుమార్, మంత్రునాయక్, సీపీఎం నాయకులు లూథర్, భారతి, సుబ్బారెడ్డి, తదితులున్నారు.

