చిలకలూరిపేట: 16వ నంబరు జాతీయ రహదారిపై యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు దుర్మరణం చెందారు. ఒరిస్సా రాష్ట్రం, గంజం జిల్లా, బరంపుర్ మండలంకు చెందిన భార్యా భర్తలు సుభాష్‌నాయక్(40), ఈదా (35)లు గత ఏడు నెలలుగా స్థానిక నందివర్థన స్పిన్నింగు మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం చిలకలూరిపేట వెళ్లి ఆటోలో తిరిగి వచ్చారు. మిల్లు వద్ద రోడ్డు దాటుతుండగా గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న దంపతులను కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులకు ఒక బాబు ఉన్నాడు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ ఐ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.


