
చిలకలూరిపేట రూరల్: జాతీయ రహదారిపై చిలకలూరిపేట ps 5 వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి, కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స మృతి చెందారు.బాపట్ల జిల్లా మార్టూరు నుంచి ప్రయాణికుల ఆటో చిలకలూరిపేట వస్తోంది. రామచంద్రపురం సర్వీస్ రోడ్డు నుండి ఆటో జాతీయ రహదారి పైకి ఎక్కింది. ఈ క్రమంలో ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు ఆటోను వెనకనుంచి ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు పక్కన బోల్తా పడింది కారు కూడా పక్కకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న బొప్పూడి గ్రామానికి చెందిన షేక్ ఖాసిం పీరా, మార్టూరుకు చెందిన ఆటో డ్రైవర్ కరీం భాష, నాగరాజు పల్లి గ్రామానికి చెందిన అత్తా కోడలు గల్లా సౌరమ్మ, గల్లా పేరమ్మ లు తీవ్రంగా గాయపడ్డారు. ఖాసిం పీరా మార్టూరు లోనే ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని గ్రామానికి వస్తున్నాడు. పేరమ్మ, శౌరమ్మలు కావూరులో ఓ వివాహ కార్యక్రమానికి వస్తున్నారు.
నలుగురిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఖాసింపీరా(60), పేరమ్మ(60) చికిత్స పొందుతూ మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
