చిలకలూరిపేట: నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలీ వానకి కుప్ప కూలు తుంది..అనే సామేతను నిజం చేస్తూ పట్టణంలో ప్రభుత్వానికి అత్యంత ఆదాయాన్ని ఆర్జించే కార్యాలయంలోని కీలక ఉద్యోగికి బదిలీవేటు పడనుంది. ఈ నెలాఖరుకు అతను ఈ కార్యాలయం నుంచి బదిలీ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కార్యాలయ అవినీతిపై వరుస కథనాలు వెలువడటంతో పాటు గతంలో ఓ ప్రజాప్రతినిధి పీఏ వద్ద వెయ్యి రూపాయలు లంచం అడగటం, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి స్వాఆర్జితమే లక్ష్యంగా ఇతను పనిచేశాడు. గుంటూరులోని ఒక ప్రజా ప్రతినిధి అండదండలతోతనకు ఏమీ కాదన్న అహంకారంతో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఉండటంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై సీరియస్ అయినట్లు, మొత్తం వ్యవహారంపై ఆరా తీయటంతో ఈ అధికారి లంచావతారం బట్టబయలైంది. ప్రజల నుంచి నేరుగా ఈ అధికారి, కార్యాలయానికి చెందిన మరి కొందరిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కీలక అధికారిని చిలకలూరిపేట నుంచి బదిలీ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే బదిలీపై వెళ్లుతున్న సదరు అధికారి అత్యంత ఆదాయం వచ్చే ప్రాంతం (హాట్ కార్యాలయం) కావాలని పైరవీలు చేస్తున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటివరకు సదరు ఆధికారి అతని కింద పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పి కార్యాలయానికి వచ్చే వారిని ముప్పు తిప్పలు పెట్టీ ముక్కుపిండి మరీ 0.5 కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరుకు అవినీతికి పాల్పడే ఆ ఇద్దరు బదిలీ కానున్నారని తెలియడంతో అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

