చిలకలూరిపేట పట్టణంలో కొన్ని వార్డుల్లో వాలంటీర్లు కొద్ది నెలల క్రితం తమ ఉద్యోగాన్ని మానివేశారు. అయితే ఖాళీగా ఉన్న వార్డుల్లో మున్సిపల్ అధికారులు కొత్తవారిని నియమించి వారికి జాయినింగ్ లెటర్లు అందజేశారు. జాయినింగ్ లెటర్లు అందజేసి నెలలు గడుస్తున్నా నూతనంగా వచ్చిన వాలంటీర్లకు ఐడి నెంబర్లు ఇప్పటి వరకు కేటాయించలేదు. కొత్త వాలంటీర్లకు ఐడి నెంబర్లు కేటాయించకపోవడం వల్ల వారికి కొద్ది నెలలుగా జీతాలు రావడం లేదు, తమకు ఐడి నెంబర్ కేటాయిస్తే పూర్తిస్థాయిగా విధుల్లో చేరి సేవ చేస్తామని కొత్తగా వచ్చిన వాలంటీర్లు వాపోతున్నారు. పట్టణంలో నూతనంగా వచ్చిన వాలంటీర్లకు ఐడి నెంబర్ కేటాయించి వారికి జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నారు.
కొత్త వాలంటీర్లకు ఇబ్బందులు
ప్రతి పథకానికి వాలంటీర్ తమ పరిధిలోని 50 కుటుంబాలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అయితే ఏ పథకం దరఖాస్తు చేసుకోవాలన్న వాలంటీర్ కు ఐడి నెంబర్ తప్పనిసరి. ఐడి నెంబర్ తో మాత్రమే సచివాలయంలో ఆ 50 కుటుంబాల సంబంధించిన పథకాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాలంటీర్ పరిధిలో పెన్షన్ అందజేయాలన్నా, వేలిముద్ర పడని వారికి తమ ఐడీ తో మాత్రమే పెన్షన్, బియ్యం అందజేస్తారు. అయితే ఐడి నెంబర్ లేకపోవడంతో వేలిముద్రపడని పెన్షన్ దారులకు, బియ్యం తీసుకునే వారికి పూర్తిస్థాయిలో సేవలు చేయలేకపోతున్నామని కొత్తగా వచ్చిన వాలంటీర్లు వాపోతున్నారు.

