రాష్ట్రవ్యాప్తంగా డిజిపి ఆదేశాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. బుధవారం మొదటి రోజు రెవిన్యూ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో అవినీతి తిమింగలాలు భారీ ఎత్తున బయటపడ్డాయి. దీంతో రెండో రోజు కూడా రెవెన్యూ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి పెచ్చుమీరిందని టోల్ ఫ్రీ నెంబర్ కు అనేక ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. రెండో రోజు గురువారం కూడా దాడులు జరుగుతాయని ఉద్దేశంతో చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ సెలవు పెట్టారు. ఏసీబీ దాడులు జరుగుతున్నప్పుడల్లా అధికారులు పర్మిషన్ పెట్టి సెలవు పెట్టడం ఆనవాయితీగా మారింది. దీంతో గురువారం ఇన్చార్జి సబ్ రిజిస్టర్ సీట్లో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు జరుగుతున్న కానీ, డాక్యుమెంట్ రైటర్లు మాత్రం రిజిస్ట్రేషన్ కి వచ్చిన వారి వద్ద జీరో పాయింట్ ఫైవ్ కమిషన్ మాత్రం వదిలిపెట్టకుండా ఈరోజు కూడా వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే రిజిస్ట్రేషన్ చేయరని ఏవో కొన్ని సాకులు చెప్పి రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తే లక్షల రూపాయల ఆస్తులు కొన్న తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.
ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి వద్దకు వెళ్లి తాము ఎంతెంత కమిషన్ సమర్పించుకున్నారో విచారణ జరిపితే కాని అసలు విషయం బయటపడదని రిజిస్టర్ కార్యాలయాల వద్ద చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా చిలకలూరిపేటలో అవినీతి చేపలు బయటపడేనా లేదా అనేది సర్వత్ర చర్చినియాంసమైంది.

