చిలకలూరిపేటలో రోజురోజుకు ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు ఊపందుకుంది. విద్య అకర్షిణీమైన వ్యాపారంగా మారటం, చిలకలూరిపేట పట్టణం ప్రస్తుత బాపట్ల జిల్లాకు సరిహద్దుగా ఉండడంతో ఈ ప్రాంతంలో ప్రైవేటు, కార్పేరేట్ పాఠశాల ఏర్పాటు కొనసాగుతుంది. ప్రతి విద్యాసంవత్సరంలో ప్రైవేటు విద్యాసంస్థలు కొత్తవి పుట్టుకొస్తునే ఉన్నాయి. వీరికి ప్రభుత్వ నిబంధనలు పట్టవు. విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేయడమే తెలుసు. తామర తంపరలా పుట్టుకొస్తున్న ఈ పాఠశాలలో వసతులు ఏలా ఉంటున్నాయి.? ప్రభుత్వ నిభంధనలు పాటిస్తున్నారా అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే విద్యాసంస్థల అడ్డగోలు వ్యవహారాలు వెలుగులోకి వస్తాయి.
ఇష్టానుసారం ఫీజులు...
ఇంగ్లిషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. దీంతో యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి వస్తుండటంతో తల్లిదండ్రులు ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రతిఏడాది ఆయా పాఠశాలల యాజమాన్యాలు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతూనే ఉన్నా యి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోంది. కంప్యూటర్ క్లాసులంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజుకు అదనంగా స్కూల్ డెవలప్‌మెంట్ ఫండ్, ల్యాబ్స్, గ్రౌండ్, కంప్యూటర్ తదితర ఫీజులను వసూలు చేస్తుంటారు. ట్యూషన్ ఫీజు 50శాతం ఉంటే మిగతా ఫీజులు మరో 50శాతం వరకు ఉంటాయి.కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నది. ఇటీవలే విద్యాసంవత్సరం ముగిసింది. కాని ఇప్పుడే స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అప్పుడే పదవ తరగతి పాఠాలను చెప్పడం మొదలు పెట్టేసారు. అక్కడితో ఆగకుండా అందుకు సంబంధించిన ఫీజును కూడా ఇప్పుడే చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంది. ఫీజు చెల్లించకుంటే విద్యార్థులను పదవ తరగతికి ప్రమోట్ చేయబోమంటూ కొర్రీలు పెడుతున్నారు.
కాగితాలకే నిబంధనలు...
ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల విషయంలో నిబంధనలు కాగితాలకే పరిమితమౌతున్నాయి. జైళ్లను తలపిస్తూ ఇరుకు గదుల్లో పాఠాలు చెబుతున్నారు. పట్టణ నడిబొడ్డున స్టెల్లార్‌లో పాఠశాలలు ఏర్పాటు చేసి నిబంధనలను తూట్లు పొడుస్తున్నారు. ఒక ఒక పేరుతో పాఠశాలకు అనుమతులు తీసుకొని అదే పేరుతో వివిధ బ్రాంచిల పేరుతో పాఠశాలను నడపుతున్నారు. ఓ ప్రైవేట్స్కూల్అనుమతి కావాలంటే మొదటగా మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఆ సంబంధిత అధికారుల అనుమతి, అగ్నిమాపక సంస్థ, శానిటేషన్, ట్రాఫిక్ శాఖల అనుమతికి ఎన్‌వోసీలు ఇవ్వాలి. ఆ తర్వాత విద్యాశాఖాధికారులు హౌజ్‌లీజు పత్రాలు 10 యేండ్లు ఉన్నాయని చూసుకొని అనుమతులు ఇవ్వాలి. ఇలాంటివి ఎక్కడ కనిపించని వైనం. అంతేకాకుండా క్రీడా ప్రాంగణం, కౌన్సిలర్, సైకాలజిస్ట్, క్వాలిఫైడ్ టీచర్లు, బాత్రూమ్లు, స్టడీ హాల్, కౌన్సిలింగ్ హాల్ వంటి సౌకర్యాలు ఉండాలి. కానీ ఇవేమి పట్టించుకోకుండా విద్యాధికారులు మాముళ్ల మత్తుతో విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించలేకపోతున్నారు.
రకరకాల పేర్లతో మరో దోపిడి...
ప్రభుత్వం ఎప్పుడో పాఠశాల పేర్ల ముందు, వెనుక ట్యాగ్‌లు పెట్టరాదని నిబంధనలు విధించింది. అయితే అన్ని నిబంధనల మాదిరి ఇది అటకెక్కింది. టెక్నో స్కూల్, ఐఐటీ పౌండేషన్ స్కూల్ ఇలా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రకరకాల పేర్లతో, ట్యాగ్ లైన్‌లతో స్కూళ్లు నడుపుతూ దోచుకుంటున్నాయి. గతంలో అ న్ని పాఠశాలలకు తోకలు (ట్యాగ్) తోలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసి సంవత్సాలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ట్యాగ్(తోకలు) తొలగించలేదు. ఈ విషయంపై అధికారుల మౌనం దాల్చడం శోచనీయం.
అనుమతులు లేకుండా పాఠశాల నిర్మాణం...
ఇదంతా ఒక ఎత్తైతే పట్టణంలోని సుగాలికాలనీలో ఓ పాఠశాలకు చెందిన యజమాని ఎటువంటి అనుమతుల లేకుండానే నూతన పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించాడు. మున్సిపాలిటీ కనీసం ప్లాన్‌కు కోసం కూడా దరఖాస్తు చేయకుండా అక్రమ నిర్మాణం చేపట్టడం విశేషం. ప్రభుత్వం నిర్ధేశించిన అనుమతులు లేకుండా నిర్మితమౌతున్న స్థలం పై కూడా పలు వివాదాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధిత అక్రమ కట్టడంపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విద్యాశాఖాధికారుల మౌనం విద్యార్ధుల తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. ఇకనైనా విద్యాశాఖ అధికారులు సంబంధిత పాఠశాలపై విద్యాసంవత్సరం ప్రారంభం లోపే దాడులు నిర్వహించి, సమగ్ర విచారణ జరపాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

