728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 29, 2024

చిలకలూరిపేట మండలంలో రియల్ మాయ... పూర్తిస్థాయిలో కన్వర్షన్ కానీ భూములు... నేటికీ పంచాయతీకి రిజర్వడ్ సైట్ అప్పగించని రియల్ వ్యాపారులు...

చిలకలూరిపేట: నరసరావుపేట ను పల్నాడు జిల్లాగా ప్రకటించడంతో గత రెండు సంవత్సరాల నుండి చిలకలూరిపేట నుండి నరసరావుపేట పోవు రోడ్డు మార్గం పక్కనే వెంచర్లు పుట్టగొడుగుల్లగా వెలుస్తున్నాయి. చిలకలూరిపేట మండలం కావూరు లింగంగుంట్ల గ్రామం ఆనుకొని వాగు పక్కనే కొంతమంది వెంచర్లు వేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఒక వెంచర్ వేయాలి అంటే రోడ్ల యాక్సిస్, నదులకు దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని, మత సంస్థలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు గుళ్ళు నివాసయోగ్యంగా ఉందా లేదా అని సంబంధిత గ్రామపంచాయతీ అధికారి సర్టిఫికెట్ తప్పనిసరి తీసుకొని అవసరమైతే ఫైర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు కూడా జత చేయవలసి ఉంటుంది. రెవెన్యూ అధికారుల నుండి సర్వే నెంబర్లతో కూడిన పూర్తిస్థాయి నివేదిక తీసుకొని సదరు సర్వే నెంబర్లు భూమి కొనుగోలు చేసిన పత్రాలు పొందుపరిచి ల్యాండ్ కన్వర్షన్ను రెవెన్యూ అధికారుల ద్వారా వేయించి వెంచర్ చేసే యజమాని వెంచర్ను వేయాలి.

ల్యాండ్ మొత్తం కన్వర్షన్ చేస్తున్నారా!?

చిలకలూరిపేట మండలం కావూరు పరిధిలో వేసే వెంచర్ యజమానులు పూర్తిస్థాయిలో ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా కేవలం 60శాతం నుంచి 70 శాతం మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ చేసి మిగతా సర్వే నంబర్లు ఆ ప్రాజెక్టులో కలిపి అమ్మకం దారులను మోసం చేసి భూమి అమ్ముతున్నట్లు ఇటీవల కొంతమంది ఆరోపించారు.

ప్రభుత్వానికి నష్టం

పూర్తిస్థాయిలో ల్యాండ్ కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వానికి రావలసిన ఫీజు మొత్తం వస్తుంది. కానీ కొంత శాతం మాత్రమే చేసి కొంత శాతం కన్వర్షన్ చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం వల్ల కొనుగోలుదారు కూడా మోసపోయి బ్యాంకు లోను రాకుండా నష్టం పడాల్సి వస్తుందని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇలా పూర్తిస్థాయిలో భూమి కన్వర్షన్ చేయకుండా వేస్తున్న వెంచేర్లపై పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కోర్టులో కేసు వేస్తానని ఒక న్యాయవాది చెబుతున్నారు.

రిజర్వ్ సైటు పంచాయతీకి అప్పగించారా

ఒక వెంచర్ యజమాని వెంచర్ వేయాలంటే మెయిన్ రోడ్డు సుమారు 60 అడుగుల మేరకు వేసి సబ్ రోడ్లు 30 అడుగులకు తగ్గకుండా నిర్మించాలి. ఆ వెంచర్ కు డ్రైనేజ్, మంచి నీటి విద్యుత్ సరఫరాకు విద్యుత్ స్తంభాలు, మంచినీటి ట్యాంకులు వేసి ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం 10 శాతం భూమిని పంచాయతీకు వెంచర్ లోని ప్లాట్లు అమ్మే రోజునే రిజిస్ట్రేషన్ చేసి పంచాయతీకి అప్పగించాలి. అయితే వెంచర్ వేసి అన్ని ప్లాట్లు అమ్మిన గాని ఈరోజు వరకు లింగంగుంట్లా గ్రామపంచాయతీకి ఒక వెంచర్ యజమాని 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించలేదు.

ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శినీ వివరణ కోరగా గ్రామపంచాయతీకి రిజర్వడ్ సైట్ రిజిస్ట్రేషన్ చేపించడం కోసం రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్లు బిజీగా ఉన్నాయని సమాధానమిచ్చారు.

ఈ విషయంపై గ్రామపంచాయతీ అధికారి ఎందుకు ఆ భూమిని గ్రామపంచాయతీకి తీసుకోలేదని సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వాగు కానుకుని వెంచర్లు

గతంలో కావూరు లింగంగుంట్ల వాగు పొంగి ప్రవహించినప్పుడు రోడ్లమీదకి నీరు వచ్చి వాహన రాకపోకలు కూడా ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే నేడు భూమి విలువ పెరగడంతో ఆ భూమిని కొంతమేరకు ల్యాండ్ కన్వర్షన్ చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసే యజమానులు కొంత వాగు పోరంబోకు భూమిని ఆక్రమించుకొని మిగతాది కొంత రైతుల వద్ద కొని ప్రభుత్వానికి ఇవ్వవలసిన రిజర్వడ్ సైట్ను నామమాత్రంగా ఇస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాగు పోరంబోకు భూమిని సబ్ డివిజన్ చేపించి కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని అదే భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాగుకు అనుకొని, వెంచర్ వేస్తున్నప్పుడు సంబంధిత అధికారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తీసుకొని డాక్యుమెంట్లు అన్నీ గెజిటెడ్ అధికారి ధ్రువీకరిస్తేనే డిటిసిపి అప్రూవల్ ను అధికారులు ఇస్తారు. అయితే పై చెప్పిన విషయాలన్నీ సరైన పత్రాలు సమర్పించకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ప్రజలను మోసగిస్తున్నట్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

అధికారులకు తెలియదా!?

రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వారు నియమ నిబంధనలు పాటిస్తున్నారా...!? లేదా!? అని సంబంధిత గ్రామపంచాయతీ అధికారులకు తెలియదా!?? అని గ్రామస్తులు అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ పూర్తి చేసి ప్లాట్ లన్ని అమ్మేసిన గాని పంచాయతీకి ఇవ్వవలసిన రిజర్వడ్ సైట్ను ఎందుకు నేటి వరకు పంచయత్ కు రిజిస్టర్ చేయలేదని... దీని వెనక ఏం జరిగిందనేది పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సంబంధిత వెంచర్లు వేసే యజమాని దగ్గర పత్రాలు సరిచూసి ప్రభుత్వం ద్వారా కన్వర్షన్ భూమి ఎంత అయింది ,రెవిన్యూ సర్వే అధికారులు చేత కొలతలు కొలిపించి పూర్తిస్థాయి భూమి కన్వర్షన్ చేశారా లేదా అని విచారణ జరిప వలసిందిగా కోరుతున్నారు. 
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి న్యాయం జరిగేలా వెంచర్లు నియమ నిబంధన ప్రకారం వేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మండలంలో రియల్ మాయ... పూర్తిస్థాయిలో కన్వర్షన్ కానీ భూములు... నేటికీ పంచాయతీకి రిజర్వడ్ సైట్ అప్పగించని రియల్ వ్యాపారులు... Rating: 5 Reviewed By: NEWS UPDATE