ఆ గట్టు నుంటావా... ఈ గట్టు కొస్తావా
వైసీపీలో తీవ్రమైన వర్గపోరు
రెండు వర్గాలుగా మారిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు
చిలకలూరిపేట: ఆ గట్టు నుంటావా... ఈ గట్టు కొస్తావా అన్న విధంగా తయారైంది వైఎస్సార్ సీపీలో కొందరి పరిస్థితి. పార్టీ రెండు వర్గాలుగా మారి పోయి నప్పుడు కొంతమంది ప్రజా ప్రతినిధుల తీరు ఎటు వెళ్లాలో... ఎటు వెళ్లకూడదో తెలియని అయోగ్యగోచరంగా మారింది. ఈ సంకట పరిస్థితిల్లో వైసీపీ లో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎవరి వైపు ఉంటే ఏమౌతుందో అని మదనపడుతున్నారు.
వైసీపీలో ఏం జరుగుతోంది..?
గత ఏడాది డిసెంబర్ నెలలో చిలకలూరిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి విడదల రజిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి, ఆమె స్థానంలో చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడును నియమించారు. ఈ క్రమంలోనే విడదల రజిని, మల్లెల రాజేష్‌ల మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నెల 10 తేదీ సిద్ధం సభ అనంతరం 13వతేదీ మల్లెల రాజేష్‌నాయుడు స్థానంలో గుంటూరు నగర మేయర్‌గా ఉన్న కావటి మనోహర్‌నాయుడు ను సమన్వయకర్తగా నియమించారు, దీంతో మల్లెల రాజేష్‌నాయుడు వర్గం మండి పడ్డారు. సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానంతో యద్దం ప్రకటించినట్లు మాట్లాడారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావుతో పాటు 23 మంది రాజీనామా చేస్తామని ప్రకటించారు. మరుసటి రోజు 14వ తేదీ మల్లెలకు మద్దతుగా సంఘీభావర్యాలీ నిర్వహించి మంత్రి విడదల రజినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎవరి మద్దతు ఎవరికి...
చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన అనంతరం కావటి మనోహర్‌నాయడు చిలకలూరిపేటకు విచ్చేశారు. ఇదే సమయంలో మల్లెల రాజేష్‌నాయుడు పోటీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులకు అభినందన కార్యక్రమం పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కావటి మనోహర్‌నాయుడు, మల్లెల రాజేష్‌నాయుడు కార్యక్రమం ఒకే సమయంలో కావడంతో మున్సిపల్ కౌన్సిలర్లు రెండుగా చీలి పోయారు. చిలకలూరిపేట వైసీపీలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా.. రాజేష్ నాయుడు సభకు శనివారం 18 మంది కౌన్సిలర్లు హాజరు కాగా... మనోహర్ నాయుడు వద్ద మిగతా కౌన్సిలర్లు వెళ్లినట్లు తెలిసింది.ఇలా ఎన్నికల సమయంలో పలువురు ప్రజా ప్రతినిధులు కూడా చేరోవైపు ఉండి పోవటంతో పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లె అవకాశం ఉందని పార్టీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇది ఇలా ఉండగా బుధవారం నాడు చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు మొట్టమొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తో పాటు వైసీపీ సీనియర్ నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గొంటు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఫాని, వైసీపీ పట్టణ అధ్యక్షుడు తలహా ఖాన్ తో పాటు కొంతమంది కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ కావటి గూటికి...
వైసీపీ సమన్వయకర్త రాజేష్ నాయుడు గోంటు శ్రీనివాస్ రెడ్డికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ప్రస్తుతం మల్లెల రాజేష్ నాయుడు వద్ద ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లను జడ్పిటిసి సభ్యులను సర్పంచ్లను కావటి మనోహర్ నాయుడు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతమంది కౌన్సిలర్లు తాము ఎన్నికల్లో ఖర్చు చేసుకున్నామని ఇప్పటివరకు ఎటువంటి ఉపయోగం జరగలేదని తమకు ఏదో ఒకటి చేస్తే గాని తమ వద్దకు రాము అని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొంతమంది కౌన్సిలర్లను మనోహర్ నాయుడు వర్గం సంతృప్తి పరిచినట్లు విశ్వసనీయ సమాచారం.
ఒకే పార్టీలో రెండు వర్గాలు... రెండు కార్యాలయాలు
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా చిలకలూరిపేటలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మొదట వైయస్సార్సీపి సమన్వయకర్తగా మల్లెల రాజేష్ నాయుడు ను వైసీపి అధిష్టానం నియమించింది. దీంతో పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో మల్లెల రాజేష్ నాయుడు వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటివరకు అసంతృప్తిగా ఉన్న ప్రజా ప్రతినిధులను, కౌన్సిలర్లను, పార్టీ నాయకులను మరలా పార్టీలోకి తెచ్చి వైసీపీ పార్టీకి జవసత్వాలు నింపారు. ఇంతలో వైఎస్ఆర్సిపి ఎన్నికల అభ్యర్థిగా గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో మల్లెల రాజేష్ నాయుడు వర్గం తీవ్ర అసంతృప్తి లోనై రాజీనామాల వరకు వెళ్తామని ప్రకటించింది. అయితే గత నాలుగు రోజుల క్రితం మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం పక్కనే వైసీపీ అభ్యర్థి కావాటి మనోహర్ నాయుడు వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయాన్ని తీసుకున్నారు. దీంతో ఇరువర్గాలు పక్క పక్కనే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చిలకలూరిపేటలో నెలకొంది.

