విడదల గోపీనాధ్ సభ్వత్వం రద్దు
టీపీఎస్ హాజరు కాకపోవడంపై ఆగ్రహం
చిలకలూరిపేట:
ప్రజా సమస్యలపై కౌన్సిలర్ల ప్రశ్నలు, అధికారుల సమాధానాలు ప్రతిపక్షం, పాలకపక్షం అనే తేడా లేకుండా సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో అందరూ ప్రజాపక్షం వైపు మొగ్గు చూపారు. నిర్మాణాత్మక చర్చలతో పాటు, కొందరు అధికారులపై విమర్శలు, ప్రశంసలు కూడా ఈ ఏడాది చివరి మున్సిపల్ సమావేశంలో చోటు చేసుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత కౌన్సిల్ సాధారణ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం కూడా నిర్వహించారు.
సభ ప్రారంభానికి ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందిన భారత మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ సంతాపం ప్రకటించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కలగజేసుకొని ఇటీవల మృతి చెందిన చిలకలూరిపేట మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజేటి వెంకటేశ్వర్లు, బింగి రామూర్మి మృతికి సంతాపం తెలుపుదామని ప్రకటించారు.
సభ వారి మృతికి మౌనం పాటించి సంతాపం ప్రకటించింది.
గణపవరానికి పట్టణ మురుగు సమస్య తీర్చాలి...
గణపవరానికి పట్టణ ముంపు సమస్య తీర్చాలని గతం నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదని వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇటీవల తవ్విన కాల్వలతో రోడ్డు బురదమయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు టీడీపీకి చెందిన గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటి నిర్మాణం కోసం కాల్వల నిర్మాణాన్ని మార్చారని, ఇందువల్ల గణపవరంకు గణపవరానికి మురుగు సమస్య మరింత జఠిలమైందన్నారు. ఇదే విషయంపై పాముల పాటి శివకుమారి తదితరులు మాట్లాడారు.
టీపీఎస్ ఎక్కడ...
ఆక్రమణల తొలగింపులో వివక్ష చూపుతున్నారని టీడీపీ సభ్యుడు గంగా శ్రీను, బేరింగ్ మౌలాలి తదితరులు ఆరోపించారు. ఈ విషయంపై చైర్మన్ కలగజేసుకొని దీనిపై సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఇటువంటి ఆరోపణల వల్ల ఎమ్మెల్యేకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై గంగా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆమెపై ఉందన్నారు. వైసీపీ కౌన్సిలర్ కోట్యానాయక్ సమయ పాలన పై ప్రశ్నించారు. 11గంటలకు ప్రారంబం కావాల్సిన సమావేశం ఎందుకు ఆలశ్యం అవుతుందని నిలదీశారు. తన వార్డు పరిధిలో లీకుల గురించి గత సమావేశంలో ప్రస్తావించిన ఎందుకు సమస్య పరిష్కరానికి నోచుకోలేదన్నారు. పదో వార్డుకు చెందిన బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ తన వినతిని మన్నించి కుక్కల నియంత్రణకు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నందుకు కమిషనర్‌ను అభినందించారు.
శుభాకాంక్షలకు ప్రకటనలు ఇవ్వాలి..
కౌన్సిలర్ల తరుఫున నూతన సంవత్సర ప్రకటనలు ఇచ్చే అవకాశం పరిశీలించాలని టీడీపీ కౌన్సిలర్లు గంగా శ్రీనివాసరావు, బేరింగ్ మౌలాలి కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా ప్రకటనలు ఇచ్చారని, ఇదే విధంగా తమకు కూడా అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ అంశం పరిశీలిస్తానని కమిషనర్ తెలిపారు.
విడదల గోపీనాధ్ సభ్వత్వం రద్దు..
పట్టణంలోని 31వ వార్డు కౌన్సిలర్, మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీనాధ్ సభ్వత్వాన్ని సభ రద్దు చేసింది. వరుసగా గోపీ ఆరు సమావేశాలకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టేబుల్ ఎజెండాలో పొందుపరిచారు.
రూ. 53.20 కోట్లతో బడ్జెట్ ఆమోదం...
2025-26 సంవత్సారానికి రూ. 53.20తో బడ్జెట్‌ను ఆమోదించారు. ఇందుకు సంబంధించి ప్రారంభ నిల్వగా రూ. 39.42 కోట్లు చూపారు. వివిధ మార్గాల నుంచి మున్సిపాలిటీకి రూ. 35.35కోట్లు ఆదాయం రాగలదని అంచనా వేశారు. ఇందులో సాధారణ నిధుల మిగులు నుంచి అభివృద్ది పనులకు రూ. 3.20 కోట్లు, నీటి సరఫరాకు రూ. 65 లక్షలు, కాల్వల అభివృద్ది రూ. 42లక్షలు, పార్కుల అభివృద్దికి రూ. 35లక్షలు వెచ్చించనున్నారు. ఇందులో సాదారణ ఖర్చుల్లో జీతభత్యాలకు రూ. 3.24 కోట్లు పరిపాలన ఖర్చు రూ. 1.81 కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.3.24 కోట్లు వెచ్చించనున్నారు.