ఈపూరు:వామపక్షాలు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు, శ్రామికులు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎర్రజెండాను ఆవిష్కరించారు. మండలవ్యాప్తంగా వాడవాడలా అరుణ పతాకం రెపరెపలాడింది. కార్మికులు ఎర్రజెండాలు చేతపట్టి ఎక్కడికక్కడ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ దండుగా కదిలారు.కార్మికరాజ్యం వచ్చినప్పుడే కార్మికులకు పూర్తి హక్కులను రక్షించుకోలగుతామని సిపిఐ మండల కార్యదర్శి సీనియర్ నాయకులు ఊట్ల రామారావు, చిలకాబత్తిన సత్యానందంలు అన్నారు.
139 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మండల కేంద్రమైన ఈపూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికే కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మికచట్టాలన్నీ యజమానులకు అనుకూలంగా మార్చివేసిందన్నారు. దేశంలో ఉండే ప్రభుత్వరంగ సంస్థలను సైతం అంబానీ, అధానీ, జిందాల్ వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిందన్నారు.పోరాటానికి సంకేతంగా మేడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,
కార్మికుల హక్కుల కొరకు చేసిన పోరాటాలు చిరస్థాయికి నిలిచిపోతాయని మేడే పండుగ జరుపుకోవడం వారు పడ్డ కష్టానికి ప్రతిఫలమన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శ్రామికులు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.