వినుకొండ:-ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నెతెచ్చిన రాజకీయ దురంధరుడు తెలుగు రాజకీయాల్లో అందరివాడు రాజకీయ శిఖరం కొణిజేటి రోశయ్య అని వినుకొండ పట్టణ వైసీపీ అధ్యక్షులు కొత్తమాసు శివ అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు ఆర్యవైశ్య నాయకులు ఘనంగా రోశయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొత్తమాసు శివ మాట్లాడుతూ ఉమ్మడి ఎపిలో 16 సార్లు ఆర్థిక మంత్రిగా, ప్రజాపద్దుల శిల్పిగా, శాసన సభలో ప్రతిపక్షం పాలిట వికటకవిగా, సర్కార్‌కు గొంతు పెగలని ప్రశ్నలు సంధించే రాజకీయ దురంధరుడుగా, శాంతి ప్రవచనాలతో మృదు స్వభావిగా, మాటల తూటాల జడివానతో, మహోగ్ర పదాల రుధిర ధారతో, ప్రత్యర్థి రాజకీయ నేతల గుండెల్లో జల్లు సృష్టించే కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం పాత్రలోనూ పల్నాడు బిడ్డ ఎక్కడా తగ్గలేదన్నారు.కొణిజేటి రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇతర రాష్ట్రాలకు గవర్నర్ గా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితమైందని ఆయన సేవలను గుర్తు చేశారు. ఆచరణలో సాధారణత, పరిపాలనలో ప్రతిభ ఆయన ప్రత్యేకతని కొనియాడారు.
మన వల్ల భావితరాలకు అప్పుల భారం పడకూడదని ఆలోచించే వ్యక్తి రోశయ్య అని,ప్రజల డబ్బులకు మనం ధర్మ కర్తలం మాత్రమేనని, ఆర్థిక క్రమశిక్షణ తప్పితే రాబోయే రోజుల్లో ప్రజలపై భారం పడుతుందని రోశయ్యచెప్పేవారని, రోశయ్య ప్రజా ధనానికి ట్రస్టీగా మాత్రమే ఉండేవాళ్ళు అని, రాష్ట్ర ఆర్థిక శక్తి పటిష్టంగా ఉంది అంటే అది రోశయ్య వేసిన పునాదులు కారణమేనన్నారు.రాజకీయవర్గాలు, ముఠాలు లేని జీవితం రోశయ్యదేనన్నారు. ఆయన మరణంతో రాజకీయ శిఖరం ఒరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా ఆర్యవైశ్య ప్రముఖులు గుండా సురేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొన్నారు.