728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 30, 2026

బకాయిల కొండ.. అధికారుల దండ! చిలకలూరిపేట విద్యుత్ శాఖలో రూ. 23 కోట్ల తిరకాసు సామాన్యుడికి పవర్ కట్.. ప్రభుత్వ శాఖలకు మాత్రం 'గ్రీన్ సిగ్నల్'?


 చిలకలూరిపేట, పల్నాడుజిల్లా:సామాన్యుడు వెయ్యి రూపాయల కరెంట్ బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైతే చాలు.. 'ఫ్యూజ్' పీకేయడానికి విద్యుత్ సిబ్బంది సిద్ధమైపోతారు. కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరిస్తారు. కానీ, చిలకలూరిపేటలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) కార్యాలయ పరిధిలో మాత్రం కథ వేరేలా ఉంది. ప్రభుత్వ శాఖల నుంచి  సుమారు రూ. 23 కోట్ల బకాయిలు పేరుకుపోయినా, అధికారులు మాత్రం 'చూసీ చూడనట్లు' వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరు.. ఎంత బాకీ?

చిలకలూరిపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) ఆర్. అశోక్ కుమార్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, బకాయిల చిట్టా ఇలా ఉంది: ఏపీ లిఫ్ట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సుమారు రూ. 19 కోట్లు, మున్సిపల్ వాటర్ వర్క్స్ రూ. 2 కోట్ల 80 లక్షలు,తహసిల్దార్ కార్యాలయం: రూ. 38 లక్షలు,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ. 1,10,000, ట్రెజరీ కార్యాలయం రూ. 84,000..

కట్ చేశారు.. కానీ మళ్ళీ కలిపేశారు..!?

బకాయిలు వసూలు చేయాలన్న ఒత్తిడితో గత రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు పైన పేర్కొన్న అన్ని కార్యాలయాలకు కనెక్షన్లు కట్ చేశారు. అయితే, ఆయా విభాగాల అధికారులు రంగంలోకి దిగి 'ప్రజల అవసరాల' పేరుతో విన్నవించడంతో అధికారులు మెత్తబడ్డారు. మానవతా దృక్పథంతో విద్యుత్‌ను పునరుద్ధరించినప్పటికీ, ఈ భారీ బకాయిలు ఎప్పుడు వసూలు అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రజల ప్రశ్న: ఆదాయం వస్తున్నా బకాయిలు ఎందుకు?

ప్రతి కార్యాలయం ప్రజల నుంచి ఏదో ఒక రూపంలో రుసుము వసూలు చేస్తూనే ఉంది. మున్సిపల్ కార్యాలయం మంచినీటి కుళాయిలకు నెలకు రూ. 100 చొప్పున వసూలు చేస్తోంది.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపు డ్యూటీ, ఛార్జీలు కడితేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ బకాయిల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 150 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇంత ఆదాయం వస్తున్నా, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతున్నా.. విద్యుత్ బిల్లులు చెల్లించడంలో ఈ నిర్లక్ష్యం ఎందుకని సామాన్య వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. "మా దగ్గర నిమిషాల్లో కనెక్షన్ కట్ చేసే అధికారులు, కోట్ల రూపాయల బకాయిలు ఉన్న కార్యాలయాల ముందు ఎందుకు తలవంచు తున్నారు?" అని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు విద్యుత్ సంస్థ నష్టాల్లో ఉందని చెబుతూ ఛార్జీలు పెంచుతున్న ప్రభుత్వం, తన స్వంత శాఖల నుంచి వసూలు చేయాల్సిన కోట్ల రూపాయల బకాయిలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ 'బకాయిల కొండ'ను కరిగించకపోతే, విద్యుత్ శాఖ మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బకాయిల కొండ.. అధికారుల దండ! చిలకలూరిపేట విద్యుత్ శాఖలో రూ. 23 కోట్ల తిరకాసు సామాన్యుడికి పవర్ కట్.. ప్రభుత్వ శాఖలకు మాత్రం 'గ్రీన్ సిగ్నల్'? Rating: 5 Reviewed By: NEWS UPDATE