చిలకలూరిపేట: చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద గల చీరాల వెళ్లే ప్రధాన రహదారి నిత్యం రక్తసిక్తమవుతోంది. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతం వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సోమవారం ఒకే చోట కేవలం గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రమాదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది.
వరుస ప్రమాదాల పరంపర
సోమవారం ఉదయం ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు, ఒక కారు బలంగా ఢీకొన్న ఘటన మరువక ముందే, అదే స్పాట్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.చిలకలూరిపేట పట్టణం తూర్పు మాలపల్లికి చెందిన పాపా బత్తిని కోటయ్య (70) తన సొంతూరైన పర్చూరు మండలం గర్నెపూడికి టీవీఎస్ వాహనంపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కారు ఆయన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
సమయస్ఫూర్తి చాటిన 108 సిబ్బంది
ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి విషమించిందని భావించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కి రిఫర్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
ఈ ప్రాంతం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నా అధికారులు స్పందించక పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మలుపుల వద్ద కనీస జాగ్రత్తలు సూచించే బోర్డులు లేకపోవడం. వాహనాల వేగాన్ని కట్టడి చేసే స్పీడ్ బ్రేకర్లు గానీ, రేడియం గుర్తులు గానీ ఏర్పాటు చేయలేదు. వారానికి కనీసం రెండు మూడు ప్రమాదాలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయని ప్రయాణికులు వాపోతున్నారు.
సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ 'డెత్ స్పాట్' వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
...స్థానిక నివాసితులు.
ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని పసుమర్రు మలుపు వద్ద తగిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా విజ్ఞప్తి వెల్లువెత్తుతోంది.

