చిలకలూరిపేట: స్థానిక పెట్రోల్ బంకుల్లో స్టాకు నిల్వలను జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టడం, కృత్రిమ కొరతపై వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.చిలకలూరిపేట మండల సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తన సిబ్బందితో కలిసి పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంక్ యజమానులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
బాటిల్స్, క్యాన్లలో నిషేధం: పెట్రోల్‌ను విడిగా బాటిల్స్ లేదా క్యాన్లలో పోయడం నిషిద్ధం. కేవలం వాహనాల్లోకి మాత్రమే ఇంధనాన్ని నింపాలి.
అత్యవసర సేవలకు ప్రాధాన్యత: హాస్పిటల్స్, అగ్నిమాపక దళం (Fire Station), మరియు పోలీస్ సిబ్బందికి సంబంధిత అనుమతి పత్రాలతో మాత్రమే ప్రత్యేక సరఫరా చేయాలి.
నో బ్లాక్ మార్కెటింగ్: ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి, బ్లాక్ మార్కెట్‌కు తరలించకూడదు. వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (నిత్యావసర వస్తువుల చట్టం) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.అనవసరపు నిల్వలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని, పారదర్శకంగా ఇంధన పంపిణీ జరగాలని ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ స్పష్టం చేశారు.

